Telugu Global
Andhra Pradesh

వీళ్ళంతా పల్లకీలు మోయాల్సిందేనా..?

త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అన్నారే కానీ, ఎంతమందో మాత్రం చెప్పలేదు. అయితే ఇదే విషయమై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అంటే చాలామంది సీనియర్లు రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పల్లకీలను మోయాల్సిందే.

వీళ్ళంతా పల్లకీలు మోయాల్సిందేనా..?
X

ఉరిము ఉరిమి మంగళం మీదపడిందనే సామెత చాలా పాపులర్. ఇప్పుడా సామెత టీడీపీలోని సీనియర్లలో చాలామందికి వర్తించేంట్లుంది. ఎలాగంటే.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు లేకపోతే చంద్రబాబునాయుడు ఒంటరిగా పోటీచేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు. దీంతో సుమారు 25 సీట్లు టీడీపీ వదులుకోకతప్పదు. జనసేనతో పొత్తు పెట్టుకోవటమే తమ్ముళ్ళలో ఎవరికీ ఇష్టంలేదు. ఎందుకంటే.. పార్టీ నిర్మాణమే లేని, పోయిన ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 25 సీట్లివ్వటం చాలామందికి నచ్చటంలేదు.

సరే.. ఇక వేరేదారి లేదు కాబట్టి తమ్ముళ్ళు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేకపోయారు. అలాంటిది సడన్ గా బీజేపీ కూడా దూరింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్ళతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పొత్తులు తప్పటంలేదన్నారు. కొందరు సీనియర్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అన్నారే కానీ, ఎంతమందో మాత్రం చెప్పలేదు. అయితే ఇదే విషయమై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అంటే చాలామంది సీనియర్లు రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పల్లకీలను మోయాల్సిందే.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం దేవినేని ఉమ, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ రావు, బుద్ధా వెంకన్న, బోడె ప్రసాద్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొడ్డు వెంకటరమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, బండారు మాధవనాయుడు, పీవీఎస్ వర్మ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఆనం రామనాయారణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెలగపూడి రామకృష్ణతో పాటు రాయలసీమలో మరికొందరు సీనియర్లున్నట్లు సమాచారం. పార్టీవర్గాల ప్రకారం తక్కువలో తక్కువ 40 మంది సీనియర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రావటంలేదు.

తాజా డెవలప్మెంట్ల ప్రకారం పోటీ అవకాశాన్ని కోల్పోతున్న తమ్ముళ్ళని చంద్రబాబు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. హిప్నొటైజ్ చేసే వాళ్ళని హిప్నాటిస్టు మెల్లిగా తన ఆధీనంలోకి ఎలా తెచ్చుకుంటారో చంద్రబాబు కూడా తమ్ముళ్ళ విషయంలో అలాగే వ్యవహరిస్తున్నారు. ఇంతమంది పోటీచేసే అవకాశం కోల్పోవటం కూడా బహుశా టీడీపీ చరిత్రలోనే మొదటిసారేమో అనిపిస్తోంది. మరి పోటీ అవకాశం కోల్పోయిన తమ్ముళ్ళు ఊరుకుంటారా ?

First Published:  18 Feb 2024 12:57 PM IST
Next Story