ఏపీ టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
టెన్త్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉదయం 8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. వారికి మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది.
టెన్త్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉదయం 8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మొత్తం 6.64 లక్షల మంది విద్యార్థుల హాజరుకానున్న ఈ పరీక్షలకు 3,449 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు సైతం తీసుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్‌సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ బస్సులను అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుంచి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు.