Telugu Global
Andhra Pradesh

వైసీపీకి ప్రతిపక్షాల మద్దతా?

బీజేపీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తీర్మానించారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కమ్ బోర్డ్ ఛైర్మన్ కరుణాకరరెడ్డి చొరవను అభినందిస్తు మరో తీర్మానం చేశారు.

వైసీపీకి ప్రతిపక్షాల మద్దతా?
X

తప్పదు మరి విషయం అలాంటిది. గుడ్డెద్దులా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే జనాలు గడ్డిపెడతారన్న భయంతోనే లోకల్ లీడర్లందరూ వైసీపీకి మద్దతు పలికారు. ఇంతకీ విషయం ఏమిటంటే ‘తిరుపతి అభివృద్ధి-టీటీడీ నిధులు’ అనే అంశంపై పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే తిరుపతి అభివృద్ధికి ప్రతి ఏడాది టీటీడీ బడ్జెట్ నుంచి 1 శాతం నిధులు ఖర్చుపెట్టాలని ఈ మధ్యనే పాలక మండలి డిసైడ్ చేసింది.

దీన్ని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించటమే కాకుండా కోర్టులో కేసు వేస్తానని కూడా చెప్పారు. ఇదే విషయమై ముందు వెనక చూసుకోకుండా రాష్ట్రధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కూడా వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించాడు. తిరుపతి, తిరుమలను వేర్వేరుగా చూసేందుకు లేదు. తిరుపతి-తిరుమలలో ఒకటి లేకపోతే మరోటిలేదన్నది వాస్తవం. అందుకనే తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చుపెట్టడంలో తప్పులేదని జనాలు కూడా భావిస్తుంటారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే జనాలు ముందు లేదా వెనక తిరుపతిలోనే బస చేస్తారు.

తిరుపతి గుండానే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే తిరుపతి 24 గంటలూ బాగా రద్దీగా ఉంటుంది. ప్ర‌తి రోజు లక్షలాది జనాలు వస్తున్న కారణంగా పారిశుధ్యం, మంచినీరు, బస, వసతి, ట్రాఫిక్ అన్నీ సమస్యలే ఉంటాయి. అందుకనే ఈ సమస్యలను అధిగమించేందుకు టీటీడీ బడ్జెట్లో నుంచి 1 శాతం నిధులు ఖర్చు చేయాలని పాలక మండలి డిసైడ్ చేసింది. ఇందులో ఎవరికీ తప్పు కనిపించలేదు ఒక్క బీజేపీకి తప్ప.

ఇదే విషయమై జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అందరు టీటీడీ నిర్ణయానికి మద్దతు పలికారు.బీజేపీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తీర్మానించారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కమ్ బోర్డ్ ఛైర్మన్ కరుణాకరరెడ్డి చొరవను అభినందిస్తు మరో తీర్మానం చేశారు. విచిత్రం ఏమిటంటే బోర్డులో సభ్యుడుగా భాను ఉన్నపుడు తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కు టీటీడీ నిధులు ఖర్చు చేయటానికి మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యం.



First Published:  29 Nov 2023 10:27 AM IST
Next Story