దటీజ్ ఎన్టీఆర్, వైఎస్ఆర్.. రాష్ట్రంలో నాలుగు పార్టీలూ వారి కుటుంబాల చేతిలోనే..
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తర్వాత అల్లుడు చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడి చేతిలోనే టీడీపీ పనిచేస్తోంది. మరోవైపు దివంగత వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించి నడిపిస్తున్నారు.
సాధారణంగా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యుల చేతిలో ఉంటాయి. ఉత్తరాన సమాజ్‌వాదీ పార్టీ నుంచి దక్షిణాన డీఎంకే వరకు.. ఏపీలో టీడీపీ నుంచి కాశ్మీర్‌లో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వరకు ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు కుటుంబ పార్టీల్లాగానే నడుస్తున్నాయి. నడుస్తుంటాయి కూడా. కానీ, ఏపీలో పరిస్థితి ఇంకా విచిత్రం. ఇక్కడ ఎన్టీఆర్, వైఎస్ఆర్ కుటుంబాల చేతుల్లో వారి సొంత పార్టీలే కాకుండా జాతీయ పార్టీల పగ్గాలూ ఉండటం విశేషం.
కాంగ్రెస్, బీజేపీ పగ్గాలు కూడా వారివే
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తర్వాత అల్లుడు చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడి చేతిలోనే టీడీపీ పనిచేస్తోంది. మరోవైపు దివంగత వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ. ఇక ఎన్టీఆర్ మరో కుమార్తె పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కమలదళాన్ని నడిపిస్తున్నారు. అంతకుముందు ఆమె కాంగ్రెస్‌లోనూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తాజా పరిణామాలతో తన సొంత పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ కుమార్తె షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.
దేశంలో ఎక్కడా లేదు
ఇలా కేవలం రెండు కుటుంబాల వారే ఓ రాష్ట్రంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలనూ నడుపుతున్న పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దివంగత ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఎంత బలమైన ముద్ర వేశారో చెప్పడానికి ఇంతకు మించి సాక్ష్యం అక్కర్లేదేమో!