Telugu Global
Andhra Pradesh

మళ్లీ తెరపైకి ప్రత్యేకహోదా.. టీడీపీకి మంచి ఛాన్స్‌!

ప్రస్తుతం ఇండియాలో 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్‌ కేటగిరి ఉన్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, ఉత్తరాఖండ్‌ ప్రత్యేక హోదా కలిగిఉన్నాయి.

మళ్లీ తెరపైకి ప్రత్యేకహోదా.. టీడీపీకి మంచి ఛాన్స్‌!
X

ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తెలుగుదేశం, జేడీయూ కీలకంగా మారాయి. ఇదే అదునుగా పలువురు జేడీయూ నేతలు ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు. బిహార్‌ అత్యంత వెనుకబడిన రాష్ట్రమని స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో అనేక వేదికల్లో ప్రధాని మోడీ.. బిహార్‌కు స్పెషల్ స్టేటస్‌‌ ఇస్తామని వాగ్దానాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే 2023 నవంబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది నితీష్‌ సర్కార్‌.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కూడా కాంగ్రెస్‌ ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రతిపాదించింది. అయితే అప్పుడు రాజ్యసభలో బీజేపీ తరపున మాట్లాడిన వెంకయ్యనాయుడు ఏపీకి 10 ఏళ్లు స్పెషల్ స్టేటస్‌ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ విషయాన్ని అటకెక్కించింది. చంద్రబాబు సైతం గతంలో స్పెషల్‌ స్టేటస్ వద్దని.. స్పెషల్ ప్యాకేజ్‌కు అంగీకరించారు. తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్‌ సైతం కేంద్రంలో బీజేపీకి సొంతంగా బలం ఉండడంతో స్పెషల్‌ స్టేటస్‌ డిమాండ్ చేయలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితి మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ, జేడీయూ మద్దతు తప్పనిసరి. ఇదే అదునుగా తెలుగుదేశం స్పెషల్‌ స్టేటస్‌ కోసం పట్టుబట్టాలన్న డిమాండ్. మరి జేడీయూ తరహాలోనే టీడీపీ స్పెషల్‌ స్టేటస్‌ కోసం డిమాండ్ చేస్తుందా, లేదా చూడాలి.

ప్రత్యేక హోదా - అర్హతలు:

భౌగోళికంగా, సామాజిక, ఆర్థికంగా ప్రతికూలతలు కలిగి ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేకహోదాను ఇస్తారు. 1969లో ఐదో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ స్పెషల్‌ స్టేటస్‌ స్కీంను తీసుకువచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

- పర్వతశ్రేణులతో కూడిన భూభాగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు

- తక్కువ జనసాంద్ర‌త, గిరిజన జనాభా అధికంగా ఉండడం

- అంతర్జాతీయ సరిహద్దులు ఉండి, వ్యూహత్మకంగా కీలకమైన రాష్ట్రాలు

- మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటుతనం

- రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఆశాజనకంగా లేకపోవడం.

ప్రస్తుతం ఇండియాలో 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్‌ కేటగిరి ఉన్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, ఉత్తరాఖండ్‌ ప్రత్యేక హోదా కలిగిఉన్నాయి. స్పెషల్ స్టేటస్ కలిగి ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. పన్ను రాయితీలు లాంటి ఇతర ప్రయోజనాలు అదనం.

First Published:  7 Jun 2024 5:11 AM GMT
Next Story