Telugu Global
Andhra Pradesh

పవన్ వ్యవహారం 48 గంటల్లో తేలిపోతుందా?

కారణాలు ఏవైనా టీడీపీతో పవన్ పొత్తు పెట్టేసుకున్నారు. ఎన్నికలు స‌మీపిస్తున్న‌ నేపథ్యంలో బీజేపీ విషయమై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. అందుకనే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో భేటీ అవుతున్నారు.

పవన్ వ్యవహారం 48 గంటల్లో తేలిపోతుందా?
X

పవన్ వ్యవహారం 48 గంటల్లో తేలిపోతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మరో 48 గంటల్లో తేలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. శుక్రవారం పవన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో అపాయింట్‌మెంట్‌ ఫైనల్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా సంవత్సరాలుగా పవన్ అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా అమిత్ షా పెద్దగా స్పందించలేదు. అలాంటిది ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పవన్‌ను కలవటానికి అమిత్ షా అంగీకరించినట్లు అర్థ‌మవుతోంది.

ఎన్‌డీఏలో ఉంటూనే పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దాంతో బీజేపీ పెద్దలు పవన్‌పై బాగా ఆగ్రహంతో ఉన్నారు. తమ కూటమిలో బీజేపీని కూడా కలుపుకోవాలని చాలాకాలంగా పవన్ చేస్తున్న ప్రయత్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. చంద్రబాబుతో చేతులు కలపటానికి ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఏమాత్రం ఇష్టపడటంలేదు. పవన్ ఆలోచనలను గ్రహించిన మోడీ, అమిత్ షాలు అసలు అపాయింట్‌మెంటే ఇవ్వటంలేదు. దాంతో వీళ్ళపై పవన్‌కు బాగా కోపం ఉన్నా చేయగలిగేదేమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు.

బీజేపీతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్ళటం పవన్‌కు ఏమాత్రం ఇష్టంలేదు. అలాగని టీడీపీ-బీజేపీని కలిపేంత కెపాసిటీ లేదు. అందుకనే తన దారి తాను చూసుకోవటంలో భాగంగానే చంద్రబాబుతో చేతులు కలిపారు. ఇదే సమయంలో స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయి.. రిమాండుకు వెళ్ళారు. జైలు నుండి చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా ఎవరు చెప్పలేకున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని అందరిలో ఉన్న అనుమానాలే పవన్‌లో కూడా ఉన్నాయి.

అయితే ఆ విషయాన్ని బయటకు చెబితే కొంపలు మున‌గ‌డం ఖాయమన్న భయంతోనే బహిరంగంగా మాట్లాడటంలేదు. కారణాలు ఏవైనా టీడీపీతో పవన్ పొత్తు పెట్టేసుకున్నారు. ఎన్నికలు స‌మీపిస్తున్న‌ నేపథ్యంలో బీజేపీ విషయమై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. అందుకనే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన-బీజేపీ బంధంపై క్లారిటీ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. బీజేపీని పవన్ వదిలేస్తే రాజకీయ సమీకరణలు మారిపోవటం ఖాయం. అప్పుడు ఏమవుతుందో చూడాల్సిందే.


First Published:  25 Oct 2023 11:06 AM IST
Next Story