Telugu Global
Andhra Pradesh

అమరావతి నిర్మాణం మొదలవుతుందా?

వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటితో అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చాలా బలంగా నమ్ముతున్నారు. అధికారంలోకి రాగానే నిలిచిపోయిన అమరావతి నిర్మాణాలను వెంటనే పునః ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ మేరకు చంద్రబాబు తమతో చెప్పినట్లు అమరావతి జేఏసీ సభ్యులు చెప్పారు.

అమరావతి నిర్మాణం మొదలవుతుందా?
X

అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతి నిర్మాణాన్ని మొదలుపెట్టే ఆలోచనలో చంద్రబాబునాయుడు ఉన్నారా? అవుననే సమాధానం వస్తోంది. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటితో అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చాలా బలంగా నమ్ముతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిలిచిపోయిన అమరావతి నిర్మాణాలను వెంటనే పునః ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ మేరకు చంద్రబాబు తమతో చెప్పినట్లు అమరావతి జేఏసీ సభ్యులు చెప్పారు.

పార్టీ ఆపీసులో అమరావతి రైతు జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్, ధనేకుల రామారావు తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణాలు, ఆర్ 5 జోన్ ఏర్పాటుచేసి పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉద్యమకారులపై పోలీసుల కేసుల్లాంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించబోతున్నట్లు హామీ ఇచ్చారట.

ఇప్పటివరకు అమరావతి నిర్మాణాన్ని పాడుపెట్టారు, ప్రపంచ రాజధాని ఏర్పాటును ధ్వంసం చేశారు, లక్షల కోట్ల సంపదను అందించే రాజధాని అమరావతి కలలను నాశనం చేశారని మాత్రమే చంద్రబాబు మండిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం వద్దని డైరెక్టుగా ఎక్కడా వ్యతిరేకించలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతే రాజధానిగా ఉంటుందని కొందరు తమ్ముళ్ళు చెబుతున్నారు కానీ డైరెక్టుగా ఎక్కడా చంద్రబాబు ప్రకటించలేదు. అలాంటిది అమరావతి రైతు జేఏసీ నేతలతో మాట్లాడిన‌ప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించే విషయంలో చంద్రబాబు గట్టి నిర్ణయంతోనే ఉన్నట్లు అర్థ‌మవుతోంది. అంటే మళ్ళీ స్విస్ చాలెంజ్, సింగపూర్ సంస్థ‌ల‌ కన్సార్టియమ్, అంతర్జాతీయ ఆర్కిటెక్టులతో డిజైన్లు గీయించటం, ప్రపంచ దేశాల పర్యటనలు, కంప్యూటర్ గ్రాఫిక్కులు తయారు చేయించటం లాంటివి చూడటానికి జనాలు మళ్ళీ సిద్ధమవ్వాల్సిందే. పనిలోపనిగా జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో పేదలకు ఈ మధ్యనే 51 వేల ఇళ్ళ పట్టాలను కూడా రద్దు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అమరావతి రాజధానిగా కావాలనుకునే జనాలు టీడీపీకి ఓట్లేస్తారు వద్దనుకునే వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా వేస్తారు.

First Published:  10 Jun 2023 11:30 AM IST
Next Story