Telugu Global
Andhra Pradesh

మార్గదర్శి మూతపడటం ఖాయమా?

సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని రామోజీలో టెన్షన్ పెరిగిపోతోంది.

మార్గదర్శి మూతపడటం ఖాయమా?
X

ఏమో అలాగని మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావే భయపడుతున్నారు. ‘మార్గదర్శి మూసివేతకు ప్రభుత్వం కుట్ర’ అని పెద్ద కథనం రాసుకుంది. మార్గదర్శిపై ప్రభుత్వం కుట్రలు చేసి మూయించేందుకు ఎలాంటి ప్రయత్నాలను చేస్తోందనే విషయాన్ని సంస్థ‌ తరపు లాయర్ అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, కథ‌నాలు ఇస్తున్న కారణంగానే ప్రభుత్వం తమపై కక్షకట్టిందని రామోజీ వాపోయారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపితే తమపై కక్షకట్టడమేనా అని అమాయకంగా అడుగుతున్నారు.

ఇదే వాదనపై గతంలోనే హైకోర్టు విచారణలో జడ్జి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంలోని లోపాలను మీ మీడియా ఎత్తిచూపుతోంది..మీ సంస్థ‌లోని తప్పులను ప్రభుత్వం చూపించింది ఇందులో తప్పేముంది’ ? అని అడిగారు. జడ్జి అడిగిన ప్రశ్నకు రామోజీ నుండి మళ్ళీ సమాధానం రాలేదు. ఇంతకాలానికి మళ్ళీ అలాంటి వాదనే సింగ్వి వినిపించారు. సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని రామోజీలో టెన్షన్ పెరిగిపోతోంది.

ఎంతసేపు 60 ఏళ్ళుగా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్న పాయింటునే రామోజీ పదేపదే లాయర్‌తో చెప్పిస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోని ఏ చట్టం ప్రకారం ప్రారంభించారో చెప్పమంటే చెప్పటంలేదు. మార్గదర్శి నిర్వహణ ఏ నియమ, నిబంధనల ప్రకారం జరుగుతోందో చెప్పమంటే మాట్లాడటంలేదు. అంటే రామోజీకి బాగా తెలుసు మార్గదర్శి వ్యాపారమంతా అక్రమం, అన్యాయమని. సంస్థ‌లో జరుగుతున్న అక్రమాలు, నియమ ఉల్లంఘనలపై సీఐడీ అడిగిన ప్రశ్నకు రామోజీ సమాధానమే ఇవ్వలేదు.

పైగా చిట్ ఫండ్ డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించకూడదనే నిబంధననను తుంగలోతొక్కి వివిధ కంపెనీల మ్యూచువుల్ ఫండ్లలో పెట్టినట్లు రామోజీ, ఆయన కోడలు, ఎండీ శైలజే అంగీకరించారు. ఇదొక్కటి చాలదా చట్టాలను, నిబంధనలను మార్గదర్శి ఉల్లంఘిస్తోందని చెప్పటానికి. మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై సీఐడీ బహిరంగ ప్రకటన చేయటాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. ఇదే విషయాన్ని లాయర్ పదేపదే విచారణలో ప్రస్తావించారు. ఏదేమైనా రామోజీ వాదన ప్రకారమే మార్గదర్శి 60 ఏళ్ళుగా అక్రమ వ్యాపారం చేస్తున్నదని అర్థ‌మవుతోంది. దీన్నొక కేసు స్టడీగా తీసుకుని కోర్టు కూడా విచారణను తొందరగా ముగించి తీర్పుచెబితే బాగుంటంది.

First Published:  4 Aug 2023 10:41 AM IST
Next Story