Telugu Global
Andhra Pradesh

అద్దంకి సిద్ధం సభ వాయిదా.. ఎందుకంటే..?

ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ధీటుగా అద్దంకి సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు.

అద్దంకి సిద్ధం సభ వాయిదా.. ఎందుకంటే..?
X

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. మార్చి3న భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే ఆ సభ ఇప్పుడు వాయిదా పడింది. వారం రోజులు సిద్ధం సభను వాయిదా వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా ఈ వాయిదాపై స్పందించారు. మార్చి 10న సభ జరుగుతుందన్నారాయన.

మేనిఫెస్టో ప్రకటిస్తారా..?

మేనిఫెస్టో కూర్పుపై కసరత్తు జరుగుతోందని కూడా తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. అది ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అద్దంకి సభలో ప్రకటిస్తారని అంటున్నారు. మేనిఫెస్టో ప్రకటన కోసమే సిద్ధం సభ వారం రోజులు వాయిదా వేసినట్టు సమాచారం. మేనిఫెస్టో కూర్పు పూర్తయిన తర్వాత సీఎం జగన్ అద్దంకి సభలో హామీలు వినిపిస్తారని, ఎన్నికల శంఖారావం పూరిస్తారని అంటున్నారు. అభ్యర్థుల తుది జాబితా కూడా ఈ సభ లోపే పూర్తి చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ధీటుగా అద్దంకి సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. 98 ఎకరాలలో సువిశాల ప్రాంగణంలో సభ జరుగుతుంది. మొత్తం 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారని సమాచారం. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం తమకు ఉందని అన్నారు విజయసాయి. అద్దంకి సిద్ధం సభలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ ప్రసంగిస్తారని, 5 గంటలకల్లా సభ పూర్తవుతుందని ఆయన తెలిపారు. సిద్ధం సభలోపే సీట్ల ప్రకటన కూడా పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు.

First Published:  28 Feb 2024 11:16 AM GMT
Next Story