Telugu Global
Andhra Pradesh

అద్దంకి రాజకీయాలు జగన్ కి తలనొప్పి తెస్తాయా..?

ఇటీవల బాలినేని పంచాయితీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైరి వర్గం టైమ్ చూసుకుని ఎమ్మెల్యేలతో జగన్ మీటింగ్ సమయంలో తాడేపల్లిలో హడావిడి చేసింది.

అద్దంకి రాజకీయాలు జగన్ కి తలనొప్పి తెస్తాయా..?
X

ఏపీలో ప్రస్తుతం వైసీపీకి 147 మంది ఎమ్మెల్యేలున్నారు. పక్క పార్టీలనుంచి వచ్చిన ఐదుగురిని కలుపుకుంటే ఆ సంఖ్య 152కి పెరుగుతుంది. మిగతా 23 స్థానాల్లో దాదాపు చాలా చోట్ల ఇన్ చార్జ్ లను పెట్టారు. వారే ఒకరకంగా అనధికార ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు, 2024 ఎన్నికల్లో వారే వైసీపీ అభ్యర్థులనే ప్రచారం కూడా ఉంది. అందులోనూ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టిన జగన్ అభ్యర్థులను ప్రకటించేశారు కూడా. అలా జగన్ ఆశీర్వాదం తీసుకున్న అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి బాచిన కృష్ణ చైతన్య ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారారు.

మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యకు అద్దంకి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అయితే వర్గాలను మేనేజ్ చేయడంలో ఆయన విఫలమయ్యారు. వైసీపీలోనే ఉన్న అసంతృప్తి వర్గం ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల బాలినేని పంచాయితీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైరి వర్గం ఇంకా అసంతృప్తిగానే ఉంది. ఎమ్మెల్యేలతో జగన్ మీటింగ్ సమయంలో ఈ అసంతృప్తి బయటపడింది. సరిగ్గా అదే రోజు టైమ్ చూసుకుని అసంతృప్తి వర్గం తాడేపల్లిలో హడావిడి చేసింది.



‘ఈ ఇన్‌ఛార్జి మాకొద్దు. సీఎం సర్‌, ప్లీజ్‌ సేవ్‌ అద్దంకి’ అంటూ అద్దంకి నియోజకవర్గ వైసీపీలోని ఓ వర్గం నాయకులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో క్రిస్టియన్‌ పేటలో నిరసన తెలిపారు. అంబేద్కర్‌, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడే నిరసన చేపట్టారు. మెడలో నల్లకండువాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.

అధికార పార్టీలో ఉన్న తమపై.. చైతన్య అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, రౌడీషీట్ తెరిపించారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ ఛార్జిగా కృష్ణచైతన్యను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తాడేపల్లి వరకు చేరడంతో పార్టీ సర్దుబాటు చేస్తుందేమో చూడాలి.

First Published:  4 April 2023 9:22 AM IST
Next Story