గొట్టిపాటి గట్టి నేతేనా?
గొట్టిపాటి హ్యాట్రిక్ కొట్టడం కన్నా మరింత పెద్ద విషయం ఉంది. అదేమిటంటే మూడు ఎన్నికలు వరుసగా మూడు పార్టీల తరపున పోటీ చేసి గెలవటం. 2009లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు.
అద్దంకి తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గట్టి నేతనే చెప్పుకోవాలి. అద్దంకిలో వరసుగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మూడుసార్లు వరుసగా గెలవటం అన్నది కొద్దిమంది విషయంలోనే జరుగుతుంది. గొట్టిపాటి హ్యాట్రిక్ కొట్టడం కన్నా మరింత పెద్ద విషయం ఉంది. అదేమిటంటే మూడు ఎన్నికలు వరుసగా మూడు పార్టీల తరపున పోటీ చేసి గెలవటం. 2009లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు.
మొదటి ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి మీద గొట్టిపాటి గెలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గొట్టిపాటికి 86,035 ఓట్లొస్తే, కరణంకు 70,271 ఓట్లొచ్చాయి. 15,764 ఓట్ల మెజారిటితో గెలిచారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ వదిలేసి గొట్టిపాటి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ అభ్యర్ధిగా గొట్టిపాటికి 99,537 ఓట్లు వచ్చాయి. టీడీపీ తరపున పోటీ చేసిన కరణం వెంకటేష్ కు 95,302 ఓట్లు పోలయ్యాయి. అంటే గొట్టిపాటి 4,235 ఓట్ల మెజారిటితో గెలిచారు.
అయితే వైసీపీ తరపున గెలిచిన గొట్టిపాటి మధ్యలోనే చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన గొట్టిపాటికి 1,05,545 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ తరపున పోటీచేసిన బాచిన చెంచుగరటయ్యకు 92,554 ఓట్లొచ్చాయి. అంటే గొట్టిపాటి 12,991 ఓట్ల మెజారిటి వచ్చింది. రెండు పార్టీల తరపున పోటీచేసి గెలిచిన నేతలున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటిమరికొందరు కాంగ్రెస్, టీడీపీల నుండి వైసీపీలో చేరి ఈ పార్టీ తరపున కూడా గెలిచారు.
అయితే మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవటం బహుశా రికార్డనే చెప్పాలి. నియోజకవర్గంలో గట్టిపట్టు లేకపోతే ఇలా గెలవటం సాధ్యంకాదు. వచ్చే ఎన్నికల్లో గొట్టిపాటి మీద వైసీపీ తరపున బాచిన కృష్ణచైతన్య పోటీచేయబోతున్నారు. మరి నాలుగోసారి కూడా గొట్టిపాటి విజయంసాధిస్తారా ?