Telugu Global
Andhra Pradesh

నెల్లూరు కార్పొరేటర్లకు ఎంపీ ఆదాల వార్నింగ్

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 26మంది కార్పొరేటర్లు ఉండగా.. వారిలో ఆల్రడీ 18మంది ఆదాలకు జై కొట్టారు. మిగతా వారిలో కూడా కొంతమంది టైమ్ చూసుకుని ఇటువైపు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

నెల్లూరు కార్పొరేటర్లకు ఎంపీ ఆదాల వార్నింగ్
X

ఈ గట్టునుంటారో లేక ఆ గట్టునుంటారో తేల్చుకోండి అంటూ కార్పొరేటర్లకు నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ చార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆ గట్టున ఉంటే మాత్రం అందరికీ మూడిందేనన్నారు. అలాంటి వారి స్థానాల్లో పార్టీ తరపున డివిజన్ ఇన్ చార్జ్ లను ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు.

అందరికీ జగన్ అపాయింట్ మెంట్..

ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అపాయింట్ దొరకడంలేదనే అపవాదు ఏపీ రాజకీయాల్లో ఉంది. కానీ ఎంపీ ఆదాల కార్పొరేటర్లందరికీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తామన్నారు. రూరల్ నియోజకవర్గంలో జగన్ చెప్పినట్టు విని, ఆయన నియమించిన ఇన్ చార్జ్ అయిన తన వెంట వచ్చేవారందర్నీ జగన్ వద్దకు తీసుకెళ్తానన్నారు. అంతే కాదు, వారి వారి వార్డుల్లో సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా చూస్తానన్నారు. నెల్లూరుకి రింగ్ రోడ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి, కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి, సమస్యలన్నీ పరిష్కరించుకుంటామన్నారు ఆదాల.

మేయర్ సహా అందరికీ ఇదే మా హెచ్చరిక..

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ఇటీవల రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో కలసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అధిష్టానం పెద్దలు తమకు ఫోన్లు చేస్తున్నారని, ఇకపై అలా చేయొద్దని, తాము కోటంరెడ్డి మనుషులం అని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని, ఆదాల కూడా సీరియస్ గా స్పందించారు. జగన్ వల్లే మేయర్ పదవి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మేయర్ అయినా, ఇంకెవరైనా వెంటనే ఆదాల గ్రూప్ లో జాయిన్ కావాల్సిందేనన్నారు. పార్టీకోసం అండగా నిలబడే వారిని తర్వాత పార్టీ గుర్తు పెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు.

26మందిలో 18మంది..

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 26మంది కార్పొరేటర్లు ఉండగా.. వారిలో ఆల్రడీ 18మంది ఆదాలకు జై కొట్టారు. మిగతా వారిలో కూడా కొంతమంది టైమ్ చూసుకుని ఇటువైపు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకింకా చాలా టైమ్ ఉండటంతో వారంతా అధికార పార్టీవైపే ఉండటానికి ఇష్టపడుతున్నారు. కోటంరెడ్డితో కలసి అప్పుడే కష్టాలు కొని తెచ్చుకోలేమని చెబుతున్నారు. ఎవరు ఎటువైపు ఉన్నా.. ఎన్నికలనాటికి గెలుపు అవకాశాలున్నవారి వెంటే కార్పొరేటర్లంతా నడుస్తారనడంలో అనుమానం లేదు.

First Published:  7 Feb 2023 2:49 PM IST
Next Story