బండారు వ్యాఖ్యలపై మండిపడ్డ ఖుష్బూ
మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని ఖుష్బూ చెప్పారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల మంత్రి రోజాపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలవడం కూడా తెలిసిందే. మంత్రి రోజా కూడా బండారు వ్యాఖ్యలపై ప్రెస్‌మీట్‌లో కన్నీటిపర్యంతమయ్యారు. బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై నటి, టీడీపీ మాజీ నేత కవిత కూడా స్పందిస్తూ.. బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా..? అంటూ నిలదీశారు. ఓ మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరని తెలిపారు.
ఈ విషయంలో మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని ఖుష్బూ చెప్పారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారు. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోడీ తీసుకొచ్చారని, మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అంటూ ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.