వద్దంటే కడుపు మాడుద్ది.. ఏది పెట్టినా తినాల్సిందే..
ఇది బిర్యానీ కాదనే భావన అలీలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కడుపు మాడ్చుకోలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోయామన్నట్టుగా అలీ మాట్లాడటం విశేషం.
రాజ్యసభ అన్నారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అన్నారు, చివరికు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీ నటుడు అలీకి పోస్టింగ్ ఇచ్చారు సీఎం జగన్. మరి ఈ పోస్టింగ్ తో అలీ సంతృప్తిగా ఉన్నారా..? ఆయన రియాక్షన్ ఏంటి..?
రాజ్యసభ అయినా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినా.. అన్నీ మీడియాలో వచ్చిన లీకులేనంటూ తేల్చిపారేశారు నటుడు అలీ. తనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వచ్చిన పదవితో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ధన్యవాదాలు తెలిపేందుకు త్వరలో సీఎం జగన్ ని కలుస్తానని చెప్పారు. నువ్వు నాతో ఉండు, నేను చూసుకుంటానంటూ.. గత ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఇప్పుడు తనకు పదవి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
అసంతృప్తి ఉందా..?
రాజ్యసభ సీటుతో రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే పదవిని సరిపోల్చలేం. అది కూడా రెండేళ్ల కాలపరిమితికే అలీకి పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై కూడా అలీ స్పందించారు. ఆకలితో ఉన్న వారికి పులిహోర పెట్టినా, దద్దోజనం పెట్టినా, పప్పన్నం పెట్టినా, బిర్యానీ పెట్టినా తినాలని.. వద్దనకూడదని అన్నారు అలీ. వద్దంటే కడుపు మాడుతుందన్నారు. అందుకే తనకు ఈ పదవి చాలని.. దీని పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. అంటే ఒకరకంగా ఇది బిర్యానీ కాదనే భావన అలీలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కడుపు మాడ్చుకోలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోయామన్నట్టుగా అలీ మాట్లాడటం విశేషం.
రాబోయే ఎన్నికల్లో పోటీపై కూడా అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారు. అయితే అలీ పదవిపై సోషల్ మీడియాలో మాత్రం సానుభూతి పవనాలు వెల్లువత్తాయి. రాజ్యసభ అని ఊరించి చివరికి సలహాదారుడిగా చేశారని అంటున్నారు కొంతమంది. పోనీ పోసానిలా కాకుండా ఏదో ఒకటి ఇచ్చారులే అది చాలని కూడా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.