గోరంట్ల వీడియో నిజమైతే చర్యలుంటాయన్న సజ్జల
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై ఆ పార్టీ స్పందించింది. ఆ వీడియో నిజమని తేలితే చర్చలు తప్పవని YSRCP నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకాల్ సోషల్ మీడియాలో రచ్ఛ రచ్చ చేసింది. ఓ మహిళతో నగ్నంగా మాట్లాడాడన్న ఆరోపణల పర్వం మొదలయింది. ఆయనపై గతంలోనే ఓ మర్డర్, రేప్ కేసుతో బాటు మరి కొన్ని పోలీసు కేసులున్నాయంటూ టీడీపీ ఆయన క్రిమినల్ చరిత్రను బయటకు తీసింది. మాజీ మంత్రులు పీతల సుజాత, అయ్యన్నపాత్రుడు ఈ కేసుల చిట్టా బయటకు తీశారు. మహిళలతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణపై ప్రస్తుత మంత్రి అంబటి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లపై ఆ నాడే సీఎం జగన్ చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు గోరంట్ల ఇలా బరి తెగించేవాడా అంటూ వీరు ఫైరయ్యారు. అయితే ఇది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల కొట్టిపారేశారు. పైగా ఇది టీడీపీ పన్నిన కుట్ర అంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారడంతో వైసీపీ స్పందించింది. ఇది మార్ఫింగ్ కాకుండా నిజమని తేలితే కచ్చితంగా మాధవ్ పై చర్య తీసుకుంటామని పార్టీ నేత సజ్జల తెలిపారు. 'నిజమని తేలిందా ? అందరికీ గుణపాఠాలుంటాయి' అని హెచ్చరించారు. గోరంట్ల మాధవ్ లోగడ పోలీసు అధికారిగా వ్యవహరించారు గనుక అప్పుడే దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఇది ఫేక్ అని ఆయన పోలీసు కంప్లయింట్ ఇచ్చారన్నారు. విచారణ జరగడం ఖాయమన్నారు.
అయితే గోరంట్ల అవతల మహిళతో మాట్లాడారా లేక పురుషునితోనా అన్నది తేలాల్సి ఉందన్నది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తన న్యూడ్ వీడియోతో గోరంట్ల వైసీపీని నగ్నంగా బయట పెట్టాడన్నది ప్రత్యర్థి పార్టీల వ్యాఖ్య. అయితే సీఎం జగన్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారని, గోరంట్లను సస్పెండ్ చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి.