హడలెత్తించిన యాసిడ్ లారీ ప్రమాదం.. - అస్వస్థతకు గురైన వాహనాల్లోని ప్రయాణికులు
ఆ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గురైంది కెమికల్ లారీ అని కొంతమంది, యాసిడ్ లారీ అని మరికొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటూ యాసిడ్ లీకవడం వల్ల ఏర్పడిన పొగ, ఘాటైన వాసన అంతటా వ్యాపించడంతో ప్రాణభయంతో అక్కడివారంతా బెంబేలెత్తిపోయారు.
కాకినాడ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారంతా ప్రాణభయంతో హడలెత్తిపోయారు. కొంతమంది అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే.. తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రో క్లోరిక్ యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ని గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో యాసిడ్ ట్యాంకర్‌కు ఉన్న పైపు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో ట్యాంకర్‌లోని యాసిడ్ లీకైంది. యాసిడ్ ప్రభావంతో ఆ ప్రాంతమంతా పెద్దఎత్తున పొగ వ్యాపించింది. అత్యంత ఘాటుగా ఉన్న ఆ యాసిడ్ పొగను పీల్చిన ట్యాంకర్ డ్రైవర్, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు సైతం తీవ్ర అస్వస్థతతో అల్లాడిపోయారు. వారిని వెంటనే 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ వాసన చుట్టుపక్కల వ్యాపించడంతో ఏం జరుగుతోందో అర్థంగాక స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గురైంది కెమికల్ లారీ అని కొంతమంది, యాసిడ్ లారీ అని మరికొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటూ యాసిడ్ లీకవడం వల్ల ఏర్పడిన పొగ, ఘాటైన వాసన అంతటా వ్యాపించడంతో ప్రాణభయంతో అక్కడివారంతా బెంబేలెత్తిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అన్నవరం ఎస్సై కిశోర్ కుమార్ సిబ్బందితో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ని జేసీబీ సాయంతో బయటకు తీసి తుని ఆస్పత్రికి తరలించారు. అనంతనం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అస్వస్థతకు గురైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.