Telugu Global
Andhra Pradesh

వారాహి యాత్రలో అపశృతి.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి యువకుడి మృతి

ఓ యువకుడు సభ వద్ద ఏర్పాటుచేసిన లైట్ స్టాండ్ పైకెక్కాడు. ఆ లైట్ స్టాండ్ ట్రాన్స్ ఫార్మర్ ఆనుకొని ఉంది. అయితే లైట్ స్టాండ్ పై నిల్చున్న యువకుడు పట్టుతప్పి ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు.

వారాహి యాత్రలో అపశృతి.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి యువకుడి మృతి
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ప్రారంభం రోజే అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడిలో జరిగిన సభకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరాగా ఓ యువకుడు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు లైట్ స్టాండ్ ఎక్కాడు. అక్కడి నుంచి పట్టుతప్పి ట్రాన్స్ ఫార్మర్ పై పడటంతో విద్యుత్ షాక్ తగిలి అక్క‌డిక్క‌డే దుర్మ‌ర‌ణం చెందాడు.

ఈరోజు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో పూజల అనంతరం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి పవన్, జనసేన శ్రేణులు సభ నిర్వహించే కత్తిపూడి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. కత్తిపూడిలో సాయంత్రం సభ ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ ను దగ్గరనుంచి చూసేందుకు గోడలు, మిద్దెలు ఎక్కారు.

ఓ యువకుడు సభ వద్ద ఏర్పాటుచేసిన లైట్ స్టాండ్ పైకెక్కాడు. ఆ లైట్ స్టాండ్ ట్రాన్స్ ఫార్మర్ ఆనుకొని ఉంది. అయితే లైట్ స్టాండ్ పై నిల్చున్న యువకుడు పట్టుతప్పి ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు. దీంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

వారాహి యాత్ర ప్రారంభమైన తొలి రోజే అపశృతి జరిగి ఒక యువకుడు మృతి చెందడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ ని చూడటానికి వచ్చే అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, గోడలు, మిద్దెలు ఎక్కవద్దని జనసేన నాయకులు సూచిస్తున్నారు.

First Published:  14 Jun 2023 8:26 PM IST
Next Story