ఆ అధికారి అక్రమ సంపాదన రూ.60 కోట్లు..! - ఏసీబీ సోదాల్లో భారీగా బయటపడుతున్న ఆస్తులు
విజయవాడలో ఒక అపార్ట్మెంటుకు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని ఈ సందర్భంగా డీఎస్పీ వెల్లడించారు.
ఆయన ఓ మున్సిపల్ కమిషనర్. పేరు సబ్బి శివరామకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో ఏక కాలంలో అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి (ఆర్ఎస్ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వ హించారు.
రెండోరోజు గురువారం కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.60 కోట్లని తేలింది. దీనిపై అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జీ ప్లస్-1 భవనం, తణుకులో రెండు జీ ప్లస్-1 భవనాలు, పాలకొల్లులో జీ ప్లస్-1 భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్ మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
విజయవాడలో ఒక అపార్ట్మెంటుకు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని ఈ సందర్భంగా డీఎస్పీ వెల్లడించారు.