చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ
చంద్రబాబు కోసం జైలులో అన్ని ఏర్పాట్లు చేశామని, ఒక బ్లాక్ మొత్తం ఖాళీ చేయించి చంద్రబాబుకే కేటాయించామని, బాబు అనుమతి లేకుండా ఆయన సమీపానికి ఎవరూ వెళ్లే అవకాశమే లేదన్నారు.
ఏసీబీ కోర్టులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో కాకుండా హౌస్ రిమాండ్‌లో ఉంచాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. వయసు 73ఏళ్లు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారని కాబట్టి హౌజ్ రిమాండ్‌కు అవకాశం ఇవ్వాలన్నారు.
లూథ్రా వాదనలను అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యతిరేకించారు. చంద్రబాబు కోసం జైలులో అన్ని ఏర్పాట్లు చేశామని, ఒక బ్లాక్ మొత్తం ఖాళీ చేయించి చంద్రబాబుకే కేటాయించామని, బాబు అనుమతి లేకుండా ఆయన సమీపానికి ఎవరూ వెళ్లే అవకాశమే లేదన్నారు. చంద్రబాబు భద్రతకు తీసుకున్న చర్యలను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు లేవని.. అరెస్ట్‌కు ముందు కూడా ఆయన రోజూ వందల కిలోమీటర్లు పర్యటిస్తూ వచ్చారని వివరించారు.
హౌస్ రిమాండ్‌పై నిన్న వాదనలు విన్న కోర్టు నేడు 4.30 గంటలకు తీర్పును వెలువరించింది. హౌస్ రిమాండ్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు చెప్పింది. రాజమండ్రి జైల్లో తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రబాబును ఇంట్లో ఉంచడం కంటే జైలులో ఉండటం వల్లనే ఎక్కువ భద్రత ఉంటుందని స్పష్టం చేసింది. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంచాలని ఆదేశిస్తూ హౌజ్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టి వేసింది.