న్యాయస్థానాల్లో మరోసారి బాబుకు ఎదురుదెబ్బ
ములాఖత్‌ల సంఖ్య పెంచాలని కోరుతూ బాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లో ప్రతివాదుల పేర్లు చేర్చనందున దీనికి విచారణార్హత లేదంటూ న్యాయస్థానం కొట్టివేసింది.
అవినీతి కేసుల్లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు న్యాయస్థానాల్లో శుక్రవారం కూడా ఎదురుదెబ్బే తగిలింది. సెంట్రల్ జైలులో లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య పెంచాలని కోరుతూ బాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లో ప్రతివాదుల పేర్లు చేర్చనందున దీనికి విచారణార్హత లేదంటూ న్యాయస్థానం కొట్టివేసింది.
అలాగే సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు ఎదురుదెబ్బే తగిలింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ఈ విచారణలో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా తన వాదనల్లో.. పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని, ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయొద్దని ఇప్పటికే కోర్టు చెప్పిందని వివరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు కస్టడీ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోందని, ఈ విషయాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించామని వివరించారు. వాదనల అనంతరం ధర్మాసనం ఈ కేసును నవంబర్ 8వ తేదీకి వాయిదా వేçస్తున్నట్టు వెల్లడించింది. అయితే న్యాయవాది సిద్ధార్థ లూథ్రా 9వ తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం ఆ మేరకు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. మరోపక్క ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్‌పైనా విచారణ జరగాల్సి ఉంది. ఫైబర్ నెట్ కేసులో విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఆ ప్రభావం పీటీ వారెంట్ పిటిషన్‌పైనా ఉండవచ్చని భావిస్తున్నారు.