చంద్రబాబు ఇరుక్కున్నట్లేనా?
లింగమనేని భూముల విలువ పెరగటానికి వీలుగానే అలైన్‌మెంట్ మార్చారని అందుకు బదులుగా కరకట్ట మీద భవనాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్నట్లు సీఐడీ లాయర్ వాదించారు. తన వాదనకు తగ్గట్లుగా ఆధారాలను కూడా చూపించారు.
కరకట్ట అక్రమ నివాసంలో చంద్రబాబునాయుడు ఉండటం క్విడ్ ప్రో కోలో భాగమే అని న్యాయస్థానం పూర్తిగా నమ్మిందా? అందుకు అవసరమైన సాక్ష్యాలున్నాయని కోర్టు అభిప్రాయపడిందా. జగన్మోహన్ రెడ్డి మీడియా కథనం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగమనేని రమేష్‌ది. ఆ భవనాన్ని జప్తు చేయటానికి ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతిచ్చింది. జప్తుకు అనుమతి ఇవ్వటంలో తప్పులేదని అందుకు పూర్తి ఆధారాలున్నట్లు కోర్టు అభిప్రాయపడిందట.
రాజధాని నిర్మాణం పేరుతో అప్పటి ప్రభుత్వం వేలాది ఎకరాల భూ సమీకరణ చేసింది. భూ సమీకరణలో లింగమనేని భూములకు లబ్ధి జరిగేట్లుగా చంద్రబాబు, నారాయణ వ్యవహరించారని సీఐడీ లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించిందట. లింగమనేని భూముల విలువ పెరగటానికి వీలుగానే అలైన్‌మెంట్ మార్చారని అందుకు బదులుగా కరకట్ట మీద భవనాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్నట్లు సీఐడీ లాయర్ వాదించారు. తన వాదనకు తగ్గట్లుగా ఆధారాలను కూడా చూపించారు.
ఈ ఆధారాలను చూసిన తర్వాత కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు ఆదేశాల మేరకే అప్పటి మంత్రి నారాయణ నడుచుకున్నారనేందుకు సాక్ష్యాలుగా కొన్ని జీవోలను, నోట్ ఫైళ్ళను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టింది. వాటన్నింటినీ జడ్జి పరిశీలించారు. క్విడ్ ప్రో కో జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందని జడ్జి వ్యాఖ్యానించారట. చంద్రబాబుకు కరకట్ట భవనం, నారాయణకు సీఆర్డీఏ పరిధిలో భూములు దక్కినట్లు కోర్టు అంగీకరించింది. కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామే అయి నడిపించినట్లు అర్థమవుతోందని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ క్విడ్ ప్రో కోలో లోకేష్‌ది కూడా కీలకపాత్రనే విషయాన్ని కోర్టు గుర్తించిందట. లింగమనేని కుటుంబానికి చెందిన భూములు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు బదిలీ జరిగింది. అయితే ఈ లావాదేవీలను చంద్రబాబు, లోకేష్ గోప్యంగా ఉంచారట. లింగమనేని కుటుంబం నుండి భూములను తీసుకోవాలని హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానించారు. అప్పుడు లోకేష్ కూడా డైరెక్టరుగా ఉన్నారు. హెరిటేజ్‌లో డైరెక్టరుగా ఉన్న సమయంలోనే మంత్రివర్గంలో కూడా కీలకంగా వ్యవహరించారని కోర్టు గుర్తించింది. సంస్థలో డైరెక్టరుగా భూములు తీసుకునేందుకు తీర్మానించి, మంత్రి హోదాలో భూముల బదలాయింపునకు అనుమతించటంలో కీలకపాత్ర పోషించారని కోర్టు ఏకీభవించింది.