Telugu Global
Andhra Pradesh

ఏపీలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ ఏసీ హెల్మెట్లు..

హెల్మెట్ పెట్టుకుంటే లోపల చల్లగా ఉందని, బరువు వల్ల ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు. దీంతో వీటి కొనుగోలుకి మార్గం సుగమం అయినట్టే చెప్పుకోవాలి.

ఏపీలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ ఏసీ హెల్మెట్లు..
X

అరగంట ఎండలో బయటకు వెళ్లొస్తేనే ఆపసోపాలు పడే పరిస్థితి. మరి నిత్యం రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పోలీసుల పరిస్థితి ఏంటి..? అక్కడక్కడా చెక్ పోస్ట్ లు ఉన్నా కూడా ఎండ వేడి తట్టుకుని గంటల తరబడి అక్కడే ఉండటం చాలా కష్టం. ట్రాఫిక్ డ్యూటీలు చేసే పోలీసులకు కాస్త వెసులుబాటు కల్పించేలా ఏపీ ప్రభుత్వం ఏసీ హెల్మట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ హెల్మెట్ పెట్టుకుంటే తలపైన చల్లగా ఉంటుంది. దీనికి ఉండే ప్రత్యేక బ్యాటరీ సహాయంతో హెల్మెట్ లోపల వాతావరణం చల్లగా మారిపోతుంది. ప్రస్తుతం వీటి పనితీరుని పరిశీలిస్తున్నారు.

అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఈ ప్రయోగం మొదలు పెట్టారు. అనంతపురం ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే లోపల చల్లగా ఉందని, బరువు వల్ల ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు. దీంతో వీటి కొనుగోలుకి మార్గం సుగమం అయినట్టే చెప్పుకోవాలి.

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ ఈ ఏసీ హెల్మెట్లను తయారు చేస్తోంది. వీటి ధర రూ.13వేలు. గంటసేపు చార్జింగ్ పెడితే 8గంటలపాటు ఇవి పనిచేస్తాయని తెలుస్తోంది. అంటే డ్యూటీ ఎక్కేముందు ఓసారి చార్జింగ్ పెడితే దాదాపుగా డ్యూటీ దిగే వరకు ఇవి కూలింగ్ ఇస్తాయి. ఈ హెల్మెట్లు సౌకర్యవంతంగా ఉన్నాయని స్థానిక పోలీసులు తెలపడంతో.. అవసరమైన్ని హెల్మెట్లు తెప్పించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

First Published:  18 May 2023 7:51 AM IST
Next Story