ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్.. ఇన్ పేషెంట్ల సంగతేంటి..?
ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించినా.. ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని మినహాయింపులిచ్చాయి.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోతున్నాయి. పెండింగ్ బిల్లుల విషయంలో నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో, ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని ఆపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదని తేల్చి చెప్పారు.
మినహాయింపులు..
ఆరోగ్యశ్రీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించినా.. ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని మినహాయింపులిచ్చాయి. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామని చెప్పారు ఆస్పత్రుల ప్రతినిధులు. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఎందుకీ గొడవ..?
పెండింగ్ బిల్లుల వ్యవహారం ఎప్పటినుంచో నలుగుతోంది. రూ.1500 కోట్లు ప్రభుత్వం తమకు బకాయిలు ఉందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే సరిగ్గా సమయం చూసి ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు తమ సమస్యని హైలైట్ చేశాయి. పాలన పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో బిల్లుల చెల్లింపు కోసం పట్టుబట్టాయి. కొన్నిరోజుల ముందుగానే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా నిన్న(మంగళవారం) రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించలేదు, ఇప్పటికిప్పుడు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొదలు పెట్టాలని పట్టుబట్టాయి. నేటి(బుధవారం)నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులు తీసుకునేది లేదని ఆశా ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.