'ఆరా'పై విమర్శలు.. మస్తాన్ ఏమన్నారంటే..?
'ఆరా' సర్వే కూటమి నేతలకు నచ్చకపోవడంతో మస్తాన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు, ఆయనకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆరా మస్తాన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి మింగుడు పడటం లేదు. ఆ మాటకొస్తే వైసీపీ కూడా ఆరా మస్తాన్ చెప్పిన నెంబర్ కంటే మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామని అంచనా వేస్తోంది. ఇక వైసీపీలో కీలక నేతలు ఓడిపోతున్నారంటూ ఆరా సంస్థ సర్వేలో తేలడంతో ఆయా నేతలు కూడా ఆరా ఎగ్జిట్ పోల్ ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ టీమ్.. ఆరాని వైసీపీ స్ట్రాటజిస్ట్ గా అభివర్ణిస్తూ పోస్టింగ్ లు పెడుతోంది. గతంలో ఆయన వైసీపీకోసం పనిచేశానని చెప్పిన వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తోంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి, ఆరా సర్వే తప్పు అయితే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆరా మస్తాన్ అసలు విషయం తేల్చి చెప్పారు. తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చారు.
"ఆరా సంస్ధ గెలవాలని కోరుకుంటా.. కానీ, ఏదో ఒక రాజకీయ పార్టీ గెలవాలని కోరుకునే వ్యక్తిని కాదు" అని అన్నారు ఆరా మస్తాన్. తాను నిజంగానే పార్టీలకోసం పనిచేసే వ్యక్తిని అయితే ఈ అంచనాలను ఎన్నికల ముందే ప్రకటించి ఉండేవాడినని చెప్పారు. అలా చేస్తే ఆ పార్టీకి మరింత లాభం చేకూరి ఉండేది కదా అని లాజిక్ తీశారు. ఎన్నికలైపోయిన తర్వాత ఫలితాలకు ముందు ఇప్పుడు తన అంచనాలు ప్రకటిస్తే దాని వల్ల తాను గెలవబోతుందని చెప్పిన పార్టీకి కలిగే లాభమేంటని ప్రశ్నించారు ఆరా మస్తాన్.
"ఆరా" సంస్ధ గెలవాలని కోరుకుంటా, ఏదో రాజకీయ పార్టీ గెలవాలని కోరుకునే వ్యక్తిని కాదు - షేక్ మస్తాన్#Aaraa #ExitPoll #UANow pic.twitter.com/9hT7RaCmiY
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 2, 2024
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని ఆరా సర్వే చెప్పింది. కూటమికి 71నుంచి 81 స్థానాలు వస్తాయని ప్రకటించింది. మహిళలు ఎక్కువగా వైసీపీకి ఓటు వేశారని, పురుషుల్లో ఎక్కువ శాతం కూటమివైపు మొగ్గు చూపినా.. స్వల్ప ఓటింగ్ శాతం తేడాతో వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు ఆరా మస్తాన్. ఆ సర్వే కూటమి నేతలకు నచ్చకపోవడంతో మస్తాన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు, ఆయనకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు ఆరా మస్తాన్ సమాధానం చెప్పారు.