Telugu Global
Andhra Pradesh

రానీలేమ్మా, రానీలేమ్మా.. రానీ రానీ

ఆమెకు జ్వరంగా ఉందని తెలుసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించడంతోపాటు, ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

రానీలేమ్మా, రానీలేమ్మా.. రానీ రానీ
X

ముఖ్యమంత్రి అయినా, కాబోయే ముఖ్యమంత్రి అయినా సెక్యూరిటీ మామూలుగా ఉండదు. ఆ సెక్యూరిటీని దాటి ఎవరైనా ఆయనకు చేరువగా వెళ్లారంటే కచ్చితంగా అది పీఆర్ స్టంట్ అనే అనుమానం రాకమానదు. తాజాగా చంద్రబాబు పర్యటనలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కారు ఆపి ఆమెను పలకరించారు చంద్రబాబు. విజయవాడలో కూటమి సమావేశానికి హాజరైన బాబు ఉండవల్లిలోని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ ఆపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. చంద్రబాబుని దగ్గరనుండి చూసేందుకు ఆమె మదనపల్లి నుంచి వచ్చారని తెలిసింది. సెక్యూరిటీ వారిస్తున్నా కూడా చంద్రబాబు ఆమెను దగ్గరకు పిలవడం, కాసేపు మాట్లాడటం, ఆమెతో ఫొటో దిగడం.. ఇవన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇంకేముంది, సామాన్య మహిళతో కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో హెడ్డింగ్ లు పడిపోయాయి. ఆమెకు జ్వరంగా ఉందని తెలుసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించడంతోపాటు, ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.


అప్పట్లో జగన్ సిద్ధం సభల్లో అనుకోకుండా ఓ యువకుడు స్టేజ్ పైకి వస్తే ఆయన్ను ఆపొద్దని, రానివ్వాలంటూ జగన్ పోలీసులకు సూచించారు. రానీలేమ్మా, రానీ రానీ అంటూ జగన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారాయో అందరికీ తెలుసు. ఆ తర్వాత సిద్ధం బస్సు యాత్రలో కూడా చాలామంది మహిళలు చెప్పుల్లేకుండా మండుటెండలో జగన్ కోసం పరిగెత్తడం, చివరకు ఆయన్ను చూసి సంతోషపడటం.. ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా.. ఓ మహిళ రేవంతన్నా అని పిలవగానే ఆయన ఆగిపోయి దగ్గరకు వచ్చారు, ఆమె కష్టాలు తెలుసుకుని తానున్నానని భరోసా ఇచ్చారు. అప్పట్లో దీన్ని పీఆర్ స్టంట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఓ రేంజ్ లో ట్రోల్ చేసింది.

చంద్రబాబు కొత్త నాయకుడేం కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రజలతో ఆయన ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. అయితే ఇటీవల నేను మారానోచ్ అంటూ చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ మార్పు ఇదేనా అంటూ ఈరోజు జరిగిన ఘటనను ఎల్లో మీడియా వీర లెవల్లో హైలైట్ చేస్తోంది. ఇలాంటి పీఆర్ స్టంట్ లు ప్రచారానికి బాగానే ఉంటాయి కానీ, పూర్తిగా వాటినే నమ్ముకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  11 Jun 2024 6:19 PM IST
Next Story