Telugu Global
Andhra Pradesh

కాపు సోదరా మేలుకో

మొత్తానికి వీడియోలో చెప్పింది ఏమిటంటే కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి పొత్తు కుదుర్చుకోవటాన్ని కాపులు ఎవరు హర్షించటంలేదు, స్వాగతించటంలేదని చెప్పేశారు.

కాపు సోదరా మేలుకో
X

కాపు సోదరా మేలుకో అనే టైటిల్‌తో ఒక వీడియో సాంగ్ విపరీతంగా వైరల్ అవుతోంది. 5.03 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హెచ్చరికగానే ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను, వెన్నుపోటును, అవసరానికి వాడుకుని వదిలేసే పద్దతిపై తీవ్ర విమర్శలున్నాయి. చంద్రబాబు మాయలో ప‌డొద్ద‌ని, బాబు ముళ్ల ప‌ల్ల‌కీని మోయటానికి కాపులు సిద్ధంగా లేరని హెచ్చరించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టీడీపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళుతుందని పవన్ రాజమండ్రిలో ప్రకటించింది గురువారం మధ్యాహ్నం. శుక్రవారం మధ్యాహ్నానికల్లా చంద్రబాబు నైజాన్ని విమర్శిస్తు పాటరాసేయటం, పవన్‌కు హెచ్చరికలు చేయటం, గతంలో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్‌టీఆర్‌, వంగవీటి రంగా హత్యకు చంద్రబాబే కారణమనే ఆరోపణల ఉదంతాలన్నింటినీ ప్రస్తావించారు.

పిల్లనిచ్చిన మామగారు ఎన్‌టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నీకు మాత్రం వెన్నుపోటు పొడవకుండా ఉంటారా అని పవన్‌ను నిలదీశారు. మొత్తానికి వీడియోలో చెప్పింది ఏమిటంటే కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి పొత్తు కుదుర్చుకోవటాన్ని కాపులు ఎవరు హర్షించటంలేదు, స్వాగతించటంలేదని చెప్పేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబానికి జరిగిన అవమానాన్ని కూడా ప్రస్తావించారు.

ఈ వీడియోలో చెప్పారని కాదుగాని గోదావరి జిల్లాల్లోని కాపు సంఘాల్లోని ప్రముఖులు కొందరు టీడీపీతో పొత్తు పెట్టుకోవటాన్ని తప్పుపడుతు వాట్సప్ మెసేజ్‌లు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అంటే చంద్రబాబుతో పవన్ చేతులు కలపటం కాపుల్లోనే చాలామందికి నచ్చలేదన్న విషయం అర్థ‌మవుతోంది.

కానీ చంద్రబాబు, పవన్ లెక్కలైతే వేరేగా ఉన్నాయి. గోదావరి, ఉత్తరాంధ్రలో కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడిపోతాయని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో టీడీపీ ఓట్లు+కమ్మ సామాజికవర్గం ఓట్లు జనసేనకు పడతాయని పవన్ అనుకుంటున్నారు. అయితే జనసేనలోనే కొందరేమో జనసేన ఓట్లు టీడీపీకి పడినా టీడీపీ ఓట్లు జనసేనకు పడతాయనే నమ్మకం లేదని చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ ఓట్లు గతంలో కూడా ఇతర పార్టీలకు ట్రాన్స్ ఫర్ అయ్యింది తక్కువనే అంటున్నారు. మొత్తంమీద టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారో తెలియ‌కుండా ఉంది.


First Published:  16 Sept 2023 5:37 AM GMT
Next Story