అంతా జగన్ మహిమేనా? లైఫ్‌లో ఫస్ట్ టైం..
సీఐడీ విచారణను కాల మహిమో లేకపోతే జగన్ మహిమో అని చెబుతున్న రామోజీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి రోజు బురదచల్లేస్తుండటాన్ని ఏమనాలి? కొత్తగా బురదచల్లటానికి ఏమీ లేకపోతే ఎప్పటెప్పటివో విషయాలను పట్టుకొచ్చి మళ్ళీ రాయటాన్ని ఏమనాలి?
మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేసులో రామోజీరావు ఏ1 నిందితుడిగా సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తన ఇంటికి విచారణ కోసం వచ్చిన సీఐడీ అధికారులతో అనారోగ్యం పేరుతో రామోజీ మంచంమీదే పడుకుని మాట్లాడారు. అప్పట్లో మంచం మీద పడుకుని ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలోను, సాక్షి మీడియాలోను రావటంపై రామోజీ తీవ్ర అభ్యంతరాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్లో సీఐడీ అధికారులతోనో లేకపోతే తన మంచం పక్కనే ఉన్న మరెవరితోనో రామోజీ మాట్లాడిన 53 సెకన్ల వీడియో తాజాగా సర్క్యులేషన్లోకి వచ్చింది.
దాని ప్రకారం రామోజీ ఏమన్నారంటే లైఫ్‌లో ఫస్టటైమట తనకు ఈ చిరాకు. తన వయసు 87 అని ఇంతవరకు తన దగ్గరకు ఏ సీఐ కానీ ఎవరు కానీ రాలేదన్నారు. ఇది బహుశా కాలమహిమ కావచ్చు లేదా జగన్ మహిమ కూడా కావచ్చన్నారు. ఏదైనా కానివ్వండి ఏం చేస్తాం అని ఎవరో సహాయకుడు తెచ్చిన మందును నోట్లో పోసుకున్నారు. తర్వాత రామోజీ పడుకున్న మంచాన్ని తలవైపు ఎవరో పైకి లేపితే నోటి దగ్గరకు తీసుకొచ్చి ఒక బేసిన్ను ఇంకెవరో పట్టుకున్నారు. అంటే తనింట్లోనే ఆసుపత్రి ఐసీయూ ఏర్పాట్లు చేసుకున్నట్లున్నారు.
డబ్బుకు, మనుషులకు కొదవలేదు కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే తన లైఫ్‌లో ఫస్ట్ టైమని, ఇంతవరకు ఒక్క సీఐ కూడా తన దగ్గరకు రాలేదని తెగ బాధపడిపోయారు. ఎవరైనా లైఫ్‌లో పోలీసు స్టేషన్‌కు లేదా దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాలని లేదా కోర్టు మెట్లెక్కాలని కోరుకుంటారా?
సీఐడీ విచారణను కాల మహిమో లేకపోతే జగన్ మహిమో అని చెబుతున్న రామోజీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి రోజు బురదచల్లేస్తుండటాన్ని ఏమనాలి? కొత్తగా బురదచల్లటానికి ఏమీ లేకపోతే ఎప్పటెప్పటివో విషయాలను పట్టుకొచ్చి మళ్ళీ రాయటాన్ని ఏమనాలి? నిజానికి జగన్-రామోజీ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను రక్షించటం కోసం జగన్ ప్రభుత్వంపైన ఎంత బురదచల్లుతున్నారో అందరు చూస్తున్నదే. జగన్ పైన బురదచల్లటం ఎందుకు ఇప్పుడు కాలమహిమా లేకపోతే జగన్ మహిమా అని తలపట్టుకోవటం ఎందుకు?