Telugu Global
Andhra Pradesh

మర్డర్‌ ప్లాన్‌ అట..! విజయసాయి ట్వీట్‌కు టీడీపీ కంగారు

ప్రభుత్వం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మర్డర్ ప్లాన్ చేసిందని... ఆ విషయం విజయసాయిరెడ్డికి కూడా తెలుసు కాబట్టే ముందే ట్వీట్ చేశారని దేవినేని ఉమా, జవహర్‌ ఆరోపిస్తున్నారు.

మర్డర్‌ ప్లాన్‌ అట..! విజయసాయి ట్వీట్‌కు టీడీపీ కంగారు
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో సోంపల్లి రేవు దగ్గర టీడీపీ నేతలు నీటిలో పడిన ఘటనపై టీడీపీ ఇప్పుడు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్‌ ఆధారంగా ఇది మర్డర్ ప్లాన్‌ అంటూ మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్‌ ఆరోపిస్తున్నారు.

వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, టీడీపీ నేతలు... సోంపల్లి రేవు దగ్గరకు పంటులో చేరుకున్నారు. పంటులో నుంచి నేతలను మర పడవల్లోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చే పనిచేశారు. చంద్రబాబునాయుడిని తొలుత పంటు నుంచి మర పడవలోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం దేవినేని ఉమా, పితానితో పాటు పలువురు టీడీపీ నేతలు ఒక్కసారిగా పంటులో నుంచి మర పడవలోకి ఎక్కేందుకు పంటుకు ఏర్పాటు చేసిన చెక్కపైకి వచ్చేశారు. దాంతో పంటులో నుంచి దిగేందుకు ఏర్పాటు చేసిన చెక్కను పట్టి ఉంచే గొలుసులు తెగిపోయాయి. దాంతో టీడీపీ నేతలు, చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గోదావరిలో పడ్డారు. ఈ ప్రమాదం ఒడ్డుకు దగ్గరల్లోనే జరిగింది. వెంటనే మత్స్యకారులు అప్రమత్తమై టీడీపీ నేతలను ఒడ్డుకు చేర్చారు.

టీడీపీ నేతలు... ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను తెరపైకి ఇప్పుడు తెచ్చారు. ప్రమాదం సాయంత్రం ఐదున్నరకు జరిగితే... విజయసాయిరెడ్డి మూడు గంటల 21 నిమిషాలకే టీడీపీ నేతలు గోదావరిలో పడబోతున్నారని ట్వీట్ చేశారని ప్రస్తావిస్తున్నారు. '' వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు...అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు!'' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ట్వీట్‌లో జారి పడడమే జరగబోయే పరిణామం అన్న పాయింట్‌ను పట్టుకుని ప్రభుత్వం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మర్డర్ ప్లాన్ చేసిందని... ఆ విషయం విజయసాయిరెడ్డికి కూడా తెలుసు కాబట్టే ముందే ట్వీట్ చేశారని దేవినేని ఉమా, జవహర్‌ ఆరోపిస్తున్నారు. వెంటనే విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలని కూడా ఇద్దరు మాజీ మంత్రులు డిమాండ్ చేశారు.

అయితే నిజంగానే ప్రభుత్వం మర్డర్ ప్లాన్ లాంటిది చేసి ఉంటే.. ఆ విషయాన్ని ముందే ఇలా ట్విట్టర్‌లో ఎందుకు బయటపెడుతారన్న లాజిక్‌ టీడీపీ నేతలకు ఎక్కుతున్నట్టు లేదు.

First Published:  22 July 2022 3:38 PM GMT
Next Story