కరోనా భయమా.. మానసిక సమస్యలా.. రెండేళ్లుగా ఇల్లు దాటని కుటుంబం
ఆ ఇంటి నుంచి కొద్ది రోజులుగా దుర్వాసన వస్తోంది. ఇరుగు పొరుగు వారు అది గమనించారు. శుక్రవారం రాత్రి ధైర్యం చేసి వారు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారికి ఇంటి నిండా గుట్టలుగుట్టలుగా ఆహార పదార్థాలకు సంబంధించిన పార్సిళ్ల వ్యర్థాలు కనిపించాయి
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. వైరస్ దెబ్బకు ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినప్పటికీ ఆ ప్రభావం మాత్రం జనాల్లో ఇంకా వీడలేదు. ఇప్పటికీ రెండు మాస్క్ లు ధరించి.. ఫేస్ షీల్డ్‌ల రక్షణతో బయటకు వచ్చే వారు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఓ కుటుంబం ఇల్లు కూడా దాటని సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఆ కుటుంబంలో ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి వీరు ఇల్లు దాటి బయటికి రాలేదు. అన్న ఒక్కడే అప్పుడప్పుడు బయటికి వచ్చి తినడానికి పార్సిళ్లు తీసుకెళ్లేవాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రభుత్వాలు ఎటువంటి ఆంక్షలు విధించడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా బయట తిరుగుతున్నారు. అందరూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
అనంతపురం టౌన్ వేణుగోపాల్ నగర్ లో తిరుపాలు అనే వ్యక్తి తన ఇద్దరు చెల్లెళ్ళు లక్ష్మీ, కృష్ణవేణితో కలసి ఉంటున్నాడు. అయితే కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత విధించిన లాక్ డౌన్ నుంచి ఈ కుటుంబం బయట అడుగు పెట్టలేదు. తిరుపాలు మాత్రం బయటకు వచ్చి తినడానికి పార్సిళ్లు తీసుకువెళ్లేవాడు. వారు నివాసం ఉంటున్న ఇంటికి కరెంటు బిల్లు కూడా చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. అయినప్పటికీ వారు తమ నివాసంలోని మూడో అంతస్తులో చీకటి గదిలోనే ఏళ్లకేళ్లు ఉండిపోయారు. కరెంట్ సౌకర్యం లేకపోవడంతో నీరు కూడా సరఫరా కావడం లేదు. మూడేళ్లుగా వారు స్నానాలు కూడా చేయకుండా అలాగే ఉండిపోయారు.
ఇదిలా ఉండగా ఆ ఇంటి నుంచి కొద్ది రోజులుగా దుర్వాసన వస్తోంది. ఇరుగు పొరుగు వారు అది గమనించారు. శుక్రవారం రాత్రి ధైర్యం చేసి వారు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారికి ఇంటి నిండా గుట్టలుగుట్టలుగా ఆహార పదార్థాలకు సంబంధించిన పార్సిళ్ల వ్యర్థాలు కనిపించాయి. మూడో అంతస్తులోని చీకటి గదిలో అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఒక మూలన కూర్చుని కనిపించారు. రెండేళ్లుగా వాళ్ళు స్నానం చేయకపోవడం తో బట్టలన్నీ మాసి చింపిరి జుట్టుతో కనిపించారు. ఈ సంఘటన గురించి బయట తెలియడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది మంది ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు.
రెండేళ్ల నుంచి అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఇల్లు కూడా దాటలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తిరుపాలు, అతడి ఇద్దరు చెల్లెళ్లను విచారించారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఆ ముగ్గురు అందుకు నిరాకరించారు. తమ మానసిక స్థితి బాగుందని స్పష్టం చేశారు. కరోనాకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నిర్వహించేవారమని తిరుపాలు తెలిపాడు. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి చెందడంతో ఉన్న ఇంటిని అమ్మేసి ముగ్గురం పంచుకుందామని అనుకున్నట్లు చెప్పాడు.
ఈలోగా లాక్ డౌన్ మొదలు కావడంతో అప్పట్నుంచి ఇంటికే పరిమితమైనట్లు పోలీసులకు తెలిపాడు. తమ మానసిక స్థితి బాగుందని.. రేపటి నుంచి ఇంటిని శుభ్రం చేసుకుంటామని అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. తిరుపాలు, అతడు ఇద్దరు చెల్లెళ్లకు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేశారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. కరోనా భయం కూడా ఓ కారణమై ఉంటుందని అంటున్నారు.