కాపాడాల్సిన కానిస్టేబులే.. కాటేశాడు
ఆమెపై కన్నేసిన కానిస్టేబుల్ భార్య విధులకు వెళ్లిన సమయంలో తాను ఇంట్లో ఉండి.. బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. 6 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
రక్షణ కల్పించాల్సిన పోలీస్ కానిస్టేబులే ఓ బాలికను కాటేశాడు. తన కుమార్తె ఆలనాపాలనా చూసుకోవడానికి తీసుకొచ్చిన బాలికపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమె గర్భం దాలిస్తే 3 నెలల క్రితం అబార్షన్ చేయించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అతని వేధింపులు తాళలేక ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
గుత్తి ప్రాంతానికి చెందిన వై.రమేశ్ కానిస్టేబుల్. అతని భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్. వారికి ఒక పాప ఉంది. రమేశ్ తన భార్యతో కలిసి అనంతపురంలో నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ ఉద్యోగులే కావడంతో పాప ఆలనాపాలనా చూసుకోవడం కోసం గుత్తి ప్రాంతానికే చెందిన బాలికను రెండున్నరేళ్ల క్రితం తీసుకొచ్చి ఇంట్లో ఉంచారు. పాప ఆలనాపాలనతో పాటు ఇంట్లో పనులు కూడా ఆ బాలిక చేసేది.
ఆమెపై కన్నేసిన కానిస్టేబుల్ భార్య విధులకు వెళ్లిన సమయంలో తాను ఇంట్లో ఉండి.. బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. 6 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భవతి కావడంతో 3 నెలల క్రితం అబార్షన్ చేయించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో లాఠీతో కొడుతూ, వైరుతో గొంతు బిగించి హింసించేవాడు.
అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఇటీవల తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు అనంతపురం పట్టణ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.