నారా లోకేష్ కుర్ర"కారు" తయారీ
మెకానిక్‌లు లోకేష్‌ని కాలేజ్ బంక్ కొట్టి బైక్ పై సినిమాకి ఎప్పుడైనా వెళ్ళారా..? ఏ బైకు అంటే మీకు ఇష్టం వంటి ప్రశ్నలు వేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుర్ర`కారు` సంగతులు బయటపెట్టారు. టీనేజ్‌లో ఓ మెకానిక్ ఫ్రెండ్ సాయంతో తాను కారు తయారు చేశానని, ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే ఉందన్నారు. ఆ కారు ఎప్పటికైనా తన కొడుకు దేవాన్ష్ వేసుకెళతాడని ఎదురుచూస్తున్నానని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా సంతనూతలపాడులో బైక్ మెకానిక్స్ తో నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మెకానిక్స్ తమ సమస్యలు లోకేష్ ముందుంచారు.
లేటెస్ట్ టెక్నాలజీ బైకులు రిపేరు చేయడంలో వెనకబడుతున్నామని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కోరారు. నూతన టెక్నాలజీ కి తగ్గట్టుగా అధునాతన పనిముట్లు అందించాలని విన్నవించారు. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది వెహికిల్ మెకానిక్‌లు పనిచేస్తున్నారని, తమ సంక్షేమానికి కృషిచేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే మెకానిక్స్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మెకానిక్‌లు లోకేష్‌ని కాలేజ్ బంక్ కొట్టి బైక్ పై సినిమాకి ఎప్పుడైనా వెళ్ళారా..? ఏ బైకు అంటే మీకు ఇష్టం వంటి ప్రశ్నలు వేశారు. వీటికి సమాధానం చెబుతూ బైక్ నడపడం అంటే ఇష్టమని, ఎన్నో సార్లు బైక్ రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరకి రిపేర్ కి తీసుకువెళ్లేవాడినన్నారు. మెకానిక్ ఫ్రెండ్‌తో కలిసి బైక్ ఇంజన్‌కి కారు ఛాసిస్ అమర్చి కారు తయారు చేశామని చెప్పారు. ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో ర్యాలీ సందర్భంగా బుల్లెట్ నడిపానని వివరించారు. కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాకి వెళ్లి ఇంట్లో దొరికిపోతే అమ్మ కొట్టిన సందర్బాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.