Telugu Global
Andhra Pradesh

గాజువాకలో ఒరిగిన‌ విగ్రహం..! నిమజ్జనం ముందే భయం భయం..!!

విశాఖలో వర్షాలు ఆగడంలేదు. పైగా విగ్రహం ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టారు. చుట్టూ ప‌ర‌దాలు ఉన్నా.. వర్షపు జల్లులతో విగ్రహం తడిచిపోతోందని, మట్టి విగ్రహం కావడంతో పెళ్లలు విరిగిపడే అవకాశముందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

గాజువాకలో ఒరిగిన‌ విగ్రహం..! నిమజ్జనం ముందే భయం భయం..!!
X

విశాఖపట్నంలో గాజువాక ఉత్సవ కమిటీ 89 అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేసింది. ఈనెల 18న నిమజ్జనం చేసేందుకు, ఆ లోపుగా ప్రతిరోజూ పూజలు పునస్కారాలు, భక్తుల దర్శనానికి అనుమతులు తీసుకుంది కమిటీ. కానీ ఉన్నట్టుండి ఆ విగ్రహం ఒక అడుగు పక్కకు జరిగిందనే పుకారు బయటకొచ్చింది. దీంతో జనం భయపడ్డారు. ఆర్ అండ్ బి అధికారులు హుటాహుటిన విగ్రహం వద్దకు వెళ్లి పరిస్థితి సమీక్షించారు. విగ్రహం పడిపోడానికి సిద్ధంగా ఉందంటూ అలర్ట్ చేశారు. వెంటనే నిమజ్జనం చేయాల్సిందేనంటున్నారు.

కుదరదు..

అధికారులు భక్తుల దర్శనాలను ఆపేశారు, వెంటనే విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని చెప్పారు. విగ్రహానికి 100 అడుగుల దగ్గర్లోకి ఎవరినీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఎవరినీ అటువైపు వెళ్లనీయడంలేదు. దీంతో ఉత్సవ కమిటీ మండిపడుతోంది. అసలు విగ్రహం పక్కకు ఒరిగిందనేది వట్టి పుకారని, దాన్ని నమ్మి అధికారులు తమని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు నిర్వాహకులు.

ముందుగానే నిమజ్జనం..

విశాఖలో వర్షాలు ఆగడంలేదు. పైగా విగ్రహం ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టారు. చుట్టూ ప‌ర‌దాలు ఉన్నా.. వర్షపు జల్లులతో విగ్రహం తడిచిపోతోందని, మట్టి విగ్రహం కావడంతో పెళ్లలు విరిగిపడే అవకాశముందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారు. అయితే ఇప్పుడు మంచిరోజులు లేవని, ఈనెల 12 సోమవారం మధ్యాహ్నం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని అంటున్నారు. ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన స్థలంలోనే వాటర్ పైప్‌లతో నీళ్లు చిలకరించి నిమజ్జనం చేస్తారు.

First Published:  10 Sept 2022 4:30 PM IST
Next Story