అర్థరాత్రి ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఘటనా స్థలిలో హాహాకారాలు మిన్నంటాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు దుర్మరణంపాలయ్యారు. 12మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రాణ నష్టం పెరిగినట్టు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన వివాహ బృందం కాకినాడలో రిసెప్షన్ కి బయలుదేరింది. ఆర్టీసీ బస్సుని వారు అద్దెకు తీసుకున్నారు. అద్దె బస్సులో గత రాత్రి పొదిలి నుంచి కాకినాడ బయలుదేరారు. బస్సులో మొత్తం 35మంది ఉన్నారు. బస్సు దర్శి సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో దర్శి సమీపంలోని సాగర్ కాల్వ వద్దకు రాగానే బస్సు కంట్రోల్ తప్పింది. సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
పొదిలి పట్టణానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఘటనా స్థలిలో హాహాకారాలు మిన్నంటాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాల్వలో బోల్తాపడిన బస్సుని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.