బీజేపీకి టచ్‌లో 55 మంది వైసీపీ ఎమ్మెల్యేలు!?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డిని కూల్చేందుకు 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని నిర్ణయించినట్టు తేలింది.
తెలంగాణ ప్రభుత్వానికి చిక్కిన ఆపరేషన్ కమల్‌ఫైల్స్‌లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు లక్ష పేజీల డేటా తెలంగాణ ప్రభుత్వానికి లభ్యమైనట్టు టీఆర్‌ఎస్ పత్రికలోనే కొద్దిరోజుల క్రితం కథనం వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్న సిట్‌కు మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
అందులో ఏపీకి సంబంధించిన కీలక అంశాలున్నాయి. ఒక వైపు జగన్‌తో బీజేపీ పెద్దలు సన్నిహితంగా ఉంటూనే, స్నేహాన్ని, ఆప్యాయతను ఒలకబోస్తూనే అసాధారణ మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో పాటు ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయబోయినట్టు సిట్ అధికారులకు ఆధారాలు లభించినట్టు టీఆర్‌ఎస్ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డిని కూల్చేందుకు 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని నిర్ణయించినట్టు తేలింది. వారిలో ఇప్పటికే 55 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించిన బ్రోకర్లకు టచ్‌లో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ 55 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు కూడా సాగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ ఆపరేషన్‌ను బద్ధలు కొట్టింది. లేకుంటే ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్‌లో మరింత వేగంగా ఈ ఆపరేషన్ కొనసాగి ఉండేదని చెబుతున్నారు.
పరిస్థితిని బట్టి ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకూ ఇచ్చేందుకు బీజేపీ సిద్దమైనట్టు కథనాలు వస్తున్నాయి.