5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. - ఆ సీట్లన్నీ వైఎస్సార్‌సీపీ కైవసం
రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఐదింటా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఆయా స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా లేకపోవడం, ప్రతిపాదితుల సంతకాలు ఫోర్జరీలు కావడంతో అధికారులు ఆయా నామినేషన్లను తిరస్కరించారు. దీంతో రంగంలో మిగిలిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరోపక్క పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు స్థానాలు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని మరో రెండు స్థానాలకు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఆయా స్థానాలకు పోలింగ్ జరగనుంది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ బరిలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు..
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు. 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఉమ్మడి రాయలసీమ పట్టభద్రుల స్థానానికి బరిలో అత్యధికంగా 49 మంది అభ్యర్థులు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి 37 మంది అభ్యర్థులు బరిలో ఉండటం విశేషం. ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది, పశ్చిమ రాయలసీమ టీచర్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు 13న పోలింగ్ జరగనుండగా, 16న కౌంటింగ్ చేపట్టనున్నారు.