బస్సు బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు
తిమ్మాయపాలెం వద్దకు చేరుకునేసరికి బస్సు కట్టర్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తాపడింది.
మొక్కు తీర్చుకునేందుకు ఓ స్కూల్ బస్సులో గుడికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 60 మందితో ప్రయాణిస్తున్న ఈ బస్సు తిమ్మాయపాలెంలోని ఆంజనేయ విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తా పడింది. బస్సు కట్టర్ విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది.
బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది ఆదివారం ఉదయం పల్నాడు జిల్లా కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో బయల్దేరారు. పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకోవడం కోసం వీరంతా కలిసి వెళ్తున్నారు. అయితే.. తిమ్మాయపాలెం వద్దకు చేరుకునేసరికి బస్సు కట్టర్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తాపడింది.
ఈ ఘటనలో 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు సాయమందించారు. వారిని వెంటనే ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. బాధితులను ఒంగోలు తరలించేందుకు అద్దంకి సీఐ సి.కృష్ణయ్య, ఎస్సై నాగరాజు, పోలీసులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.