ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లకు 4కోట్ల 29 లక్షల నజరానా!
19వ ఆసియాక్రీడల్లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లకు సీఎం జగన్మోహనరెడ్డి 4 కోట్ల 29 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు
19వ ఆసియాక్రీడల్లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లకు సీఎం జగన్మోహనరెడ్డి 4 కోట్ల 29 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్ జ్యోతి సురేఖ 90 లక్షల రూపాయలు అందుకోనుంది....
హాంగ్జు వేదికగా ఇటీవలే ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను వివిధ రాష్ట్ర్రప్రభుత్వాలు నగదు పురస్కారాలతో సత్కరిస్తూ వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం 11 పతకాలు సాధించిన అథ్లెట్లకు 4 కోట్ల 29 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది.
ఏపీ సీఎం ను కలిసిన పతక విజేతలు..
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్మోహన రెడ్డిని క్రికెట్ స్వర్ణ విజేత అనూష, రజత విజేతలు కోనేరు హంపి, జ్యోతి యర్రాజీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ అభినందన కార్యక్రమంలోనే రాష్ట్ర్రానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన క్రీడాకారులను నగదు పురస్కారాలతో సత్కరించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర్ర క్రీడామంత్రి ఆర్కే రోజా, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర్రక్రీడాకారులు తాము సాధించిన స్వర్ణ, రజత పతకాలను సీఎం ముందుంచారు.
ఆర్చర్ జ్యోతి సురేఖకు 90 లక్షలు....
19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో సాధించిన 107 పతకాలలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు సాధించినవే 11 పతకాలు ఉన్నాయి. వీటిలో విలువిద్య సంచలనం జ్యోతి సురేఖ టీమ్, వ్యక్తిగత విభాగాలలో మూడు బంగారు పతకాలు, మహిళా క్రికెట్లో అనూష, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ స్వర్ణాలు తెచ్చిన రాష్ట్ర్ర అథ్లెట్లలో ఉన్నారు.
భారత అథ్లెట్లలో అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇద్దరు అథ్లెట్లలో ఒకరిగా ఉన్న జ్యోతి సురేఖ కు స్వర్ణానికి 30 లక్షల చొప్పున మూడు పతకాలకు 90 లక్షల రూపాయలు అందచేయనున్నారు.
పురుషుల టెన్నిస్ డబుల్స్ లో రజతం నెగ్గిన సాకేత్ మైనేనికి 20 లక్షలు, బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగంలో రజతం సాధించిన కిడాంబీ శ్రీకాంత్ కు 20 లక్షలు, బ్యాడ్మింటన్ పురుషుల టీమ్, వ్యక్తిగత విభాగాలలో రజత, స్వర్ణాలు సాధించిన సాత్విక్ సాయిరాజ్ కు 50 లక్షలు, మహిళల 100 మీటర్ల హర్డల్స్ లో రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీకి 20 లక్షలు, చెస్ మహిళల టీమ్ విభాగంలో సభ్యులుగా ఉన్న గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు చెరో 20 లక్షలు చొప్పున అందించనున్నారు.