కాకినాడలో 30 మంది చిన్నారులకు అస్వస్థత
కాకినాడలోని వలసపాకల కేంద్రీయ విద్యాలయలో మంగళవారం ఒక క్లాసులోని విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
కాకినాడలోని వలసపాకల కేంద్రీయ విద్యాలయలో మంగళవారం ఒక క్లాసులోని విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రేయర్ జరిగిన అనంతరం క్లాసుకు వెళ్లిన ఐదో తరగతి విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. క్లాసులో మొత్తం 44 మంది వరకు ఉండగా, తొలుత 15 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరికొంతమంది పిల్లలు ఆరో తరగతి పిల్లలు కూడా అస్వస్థతకు గురవడంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. తొలుత వారిలో కొందరు ఊపిరి ఆడటం లేదంటూ చెప్పినట్టు తెలిసింది. మొత్తం 30 మంది స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు.
తరగతికి పక్క నుంచి దుర్వాసన కిటికీలో నుంచి రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు భావిస్తున్నారు. పాఠశాల పక్కనే ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఈ పరిస్థితి ఎదురైందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.
తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకరు నేలవాలిపోయారని, ఊపిరాడటం లేదంటూ గోడను ఆసరా చేసుకుని నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.
ఈ ఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న సమీప ప్రాంతాల్లోని తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు, అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉపాధ్యాయుడు సతీష్ ఈ విషయమై మాట్లాడుతూ.. పిల్లలందరి పరిస్థితీ బాగానే ఉందని, ఘటన ఎలా జరిగింది.. కారణమేమిటనే విషయం తమకు కూడా అర్థం కావడం లేదని చెప్పారు. ఎవరి పరిస్థితీ ప్రమాదకరంగా లేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.