అజీజ్ దారెటు..?
వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీని వీడడం అనివార్యం అయింది. అలాగే టీడీపీలోకి వెళ్లడమూ తప్పనిసరి అయింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. ఓ వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద ప్రధాన వార్తగా నిలిచింది. ఎలక్షన్ హీట్‌ని తలపించిన ఘట్టాలతో రాజకీయ సమీకరణలు కొత్తగా రూపుదిద్దుకున్నాయి. వైసీపీ చాలా వేగంగా ఆ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకరరెడ్డిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించేసింది. వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీని వీడడం అనివార్యం అయింది. అలాగే టీడీపీలోకి వెళ్లడమూ తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ పరిస్థితి ఏమిటి..?
2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాల్సిన ఆదాల ప్రభాకర రెడ్డి ఊహించని రీతిలో వైసీపీ తరఫున నెల్లూరు పార్లమెంట్ బరిలో దిగారు. ఆఖరి క్షణంలో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే సందిగ్ధావస్థలో చంద్రబాబుకు అజీజ్ ఆపద్బాంధవుడిలా కనిపించారు. వైసీపీ గుర్తుతో గెలిచి టీడీపీ మద్దతుతో నెల్లూరు మేయర్ గా కొనసాగిన అజీజ్‌కి కృతజ్ఞత ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి తనవంతు బాధ్యతగా నెల్లూరు రూరల్‌లో పోటీ చేశారు. మరి ఇప్పుడు.. ఆ స్థానంలో టీడీపీ శ్రీధర్‌రెడ్డికి టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటి..?
ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే అని నెల్లూరువాసుల అంచనా. అది.. ఆదాల చేత వైసీపీ కండువా కప్పించుకోవడం. అజీజ్‌కు అదే మంచి ప్రత్యామ్నాయం అని, ఇదే అదనుగా తన డిమాండ్‌లను ఇప్పుడే వైసీపీ ముందు పెట్టాలని ఆయన అభిమానుల అభిప్రాయం.