యూట్యూబ్‌లో చూసి.. రూ.20 లక్షలు కొట్టేశాడు
సీసీ కెమెరాల ఆధారంగా ఒక్క రోజులోనే నిందితులను గుర్తించారు పోలీసులు. శంకర్‌ను అరెస్టు చేసి.. అతని నుంచి రూ.19.21 లక్షల నగదు, బైక్, ఎలక్ట్రికల్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.
వ్యసనాలకు బానిసయ్యాడు.. స్థలం కొన్నందుకు, వ్యసనాల కోసం చేసిన అప్పులు తీర్చడం భారమైపోయింది. ఆ అప్పులు తీర్చేందుకు తాను పనిచేసిన చోటే కన్నమేశాడు. రూ.20 లక్షలు కొట్టేశాడు. ఇందుకు యూట్యూబ్‌లో వీడియోలు చూసి మరీ ప్లాన్ చేశాడు. పక్కాగా దానిని అమలు చేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.
యజమానికి నమ్మకంగా ఉండి.. డబ్బు దాచే చోటు గమనించి..
గుంటూరు నల్లచెరువు ప్రాంతానికి చెందిన శంకర్ లాలుపురం రోడ్డులోని ఎస్‌కేటీ ఎక్స్‌పోర్ట్స్ మిర్చి గోడౌన్‌లో ఏడాది పాటు ముఠా కూలీగా, మేస్త్రీగా పనిచేశాడు. యజమానులైన శ్రీధర్, ఆనంద్‌ల వద్ద నమ్మకంగా ఉండేవాడు. కూలీలకు డబ్బు చెల్లింపులు అతనే చేసేవాడు. ఈ క్రమంలో యజమానులు డబ్బు దాచే ప్రదేశాలను గమనించేవాడు. ఆ తర్వాత పని మానేసిన అతను 2018లో రెడ్డిపాలెంలో రూ.11 లక్షల వ్యయంతో ఓ స్థలం కొన్నాడు. అందుకు గాను రూ.5 లక్షలు అప్పు కూడా చేశాడు. దీనికితోడు వ్యసనాలకు బానిసైన అతనికి అప్పులు తీర్చడం గగనమైపోయింది.
యూట్యూబ్ వీడియోలు చూసి.. స్కెచ్ వేసి..
అప్పులు తీర్చాలంటే చోరీ చేయడం ఒక్కటే మార్గమని భావించాడు. తన పాత యజమానులు డబ్బు దాచే ప్రదేశాలు తెలిసిన అతను వాటినే కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో చోరీలు చేయడం ఎలాగో తెలుసుకునేందుకు కొన్ని వీడియోలు చూశాడు. అందులో గమనించిన అంశాల ఆధారంగా చోరీకి స్కెచ్ వేశాడు. తన పిన్ని కుమారుడైన పోతార్లంక నాగేశ్వరరావును చోరీకి సాయం కోరాడు. ఇద్దరూ కలిసి చోరీ కోసం ఎలక్ట్రికల్ కట్టర్, సంచి, చేతికి గ్లౌజులు, కత్తి, కారం ప్యాకెట్, కోడి మాంసం ముక్కలు సిద్ధం చేసుకున్నారు.
వాచ్‌మెన్ కళ్లలో కారం చల్లి.. కుక్కలకు మాంసం ముక్కలు వేసి...
ఈ నెల 17వ తేదీ శనివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో మంకీ క్యాప్‌లు ధరించి బైక్‌పై మిర్చి గోడౌన్‌కి చేరారు. మిర్చి గోడౌన్ వద్ద వాచ్‌మెన్ కళ్లలో కారం చల్లి, అతని కాళ్లు, చేతులు కట్టేశారు. అతని నుంచి తాళాలు లాక్కుని లోపలికి వెళ్లారు. కుక్కలు అరవడంతో వాటికి కోడి మాంసం ముక్కలు వేశారు. తాళలు తెరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఎలక్ట్రికల్ కట్టర్‌తో కోసి లోపలికి వెళ్లారు. కబోర్డును కూడా అలాగే కట్ చేసి.. అందులో ఉన్నరూ.20 లక్షల నగదును దోచుకుపోయారు. ఈ వ్యవహారం అంతా అరగంటలోనే ముగించారు. నాగేశ్వరరావుకు కొంత డబ్బు ఇచ్చి శంకర్ పంపేశాడు.
సీసీ కెమెరాల సాయంతో...
ఉదయం చోరీ జరిగిన విషయం తెలుసుకున్న యజమానుల్లో ఒకరైన ఆనంద్ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఒక్కరోజులోనే నిందితులను గుర్తించారు. శంకర్‌ను అరెస్టు చేసి.. అతని నుంచి రూ.19.21 లక్షల నగదు, బైక్, ఎలక్ట్రికల్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు నాగేశ్వరరావును త్వరలో అరెస్టు చేస్తామని ఏఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ప్రశంసించిన ఎస్పీ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.