Telugu Global
Andhra Pradesh

గంటాది వట్టి పుకారే.. 175మంది ఓటు వేశారు..

సీఎం జగన్ ఉదయం ఓటు వేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరే ఓటు వేయడానికి వచ్చారు. చివరి ఓటు కూడా వైసీపీ ఎమ్మెల్యేదే కావడం విశేషం. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, కుమారుడి వివాహం కారణంగా ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు.

గంటాది వట్టి పుకారే.. 175మంది ఓటు వేశారు..
X

ఏపీ శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 7 స్థానాలు ఖాళీగా ఉండగా వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలో దింపింది, టీడీపీ ఒక్క అభ్యర్థితో పోటీలో ఉంది. సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉండగా.. మధ్యాహ్నం 2.30 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 175మంది ఓట్లు వేశారు.

సీఎం జగన్ ఉదయం ఓటు వేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరే ఓటు వేయడానికి వచ్చారు. చివరి ఓటు కూడా వైసీపీ ఎమ్మెల్యేదే కావడం విశేషం. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, కుమారుడి వివాహం కారణంగా ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు. ఆయన విశాఖ పట్నం నుంచి హెలికాప్టర్ లో విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు చివరి ఓటు వేశారు.

గంటా ఓటుపై పుకార్లు..

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఓటు లేదని, గతంలో ఆయన స్పీకర్ ఫార్మాట్ లో చేసిన రాజీనామాని అర్జంట్ గా తమ్మినేని సీతారాం ఆమోదించారని, ఆ ఓటు టీడీపీకి మిస్సయిందనే పుకారు వినపడింది. అయితే గంటా ఓటు ఎక్కడికీ పోలేదు, ఆయన రాజీనామాను అంత హడావిడిగా స్పీకర్ ఆమోదించలేదు. దీంతో ఆయన కూడా పోలింగ్ కి వచ్చి ఓటు వేశారు.

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు కేవలం పోలింగ్ కోసమే శాసన సభా ప్రాంగణానికి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి కచ్చితంగా విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు.

ఆత్మ ప్రభోదానుసారం..

ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రభోదానుసారం అనే మాట బాగా వినపడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేశామని చెప్పారు. వారితోపాటు మొత్తం 16మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారి ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేశారని అంటున్నారు టీడీపీ నేతలు. సాయంత్రం మొదలయ్యే కౌంటింగ్ గంటల వ్యవధిలోనే ముగుస్తుంది. అసలు ఏపీ ఎమ్మెల్యేలలో ఎవరెవరి ఆత్మ ఏ పార్టీకి ఓటు వేయమన్నదనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వైసీపీ నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీలు గెలుస్తారు, తేడా కొడితే టీడీపీని తట్టుకోవడం వైసీపీకి కాస్త కష్టమే అవుతుంది.

First Published:  23 March 2023 3:08 PM IST
Next Story