తొలిరోజు 16 లక్షలు, ఏబీ వెంకటేశ్వరరావు తల్లి లక్ష విరాళం
అటు ఇటు రోప్ పార్టీగా బౌన్సర్లు నిలబడగా వారి మధ్యలో అమరావతివాదులు పాదయాత్ర చేస్తూ వెళ్లారు. తొలిరోజు భారీగా విరాళాలు వచ్చాయి. యాత్ర ప్రారంభ గ్రామాల్లోనూ 16 లక్షలు వసూలైంది.
విశాఖ, కర్నూలులో రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ఉత్తరాంధ్ర వైపుగా అమరావతివాదుల రాజధాని యాత్ర ప్రారంభమైంది. తొలిరోజు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఒక సామాజికవర్గం వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో రేణుకా చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. గుర్రాల బొమ్మలను అమర్చి ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను రేణుకాచౌదరి కాసేపు నడిపారు. ఆమెను చూడగానే అమరావతివాదులు ఉప్పొంగిపోయారు.
తొలుత రథంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని నడిపేందుకు కొందరిని తీసుకురాగా.. వారు వైసీపీ మద్దతుదారులంటూ అమరావతివాదులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ సానుభూతిపరులుగా ముద్రపడిన వారికి వాహనం నడిపే బాధ్యత ఎలా ఇస్తారంటూ అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది.
అమరావతి వాదులు చేస్తున్నది విజ్ఞుల యాత్ర అని తులసి రెడ్డి కీర్తించారు. స్థానిక బీజేపీ నేతలు అమరావతికి మద్దతు ప్రకటిస్తున్నా.. ఆ మద్దతుపై మేధావి చలసాని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షా నేరుగా జగన్‌కు ఫోన్ చేసి అమరావతే రాజధానిగా ఉండాలని చెబితే అర గంటలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ పక్కన పెట్టేస్తారని, వారెందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నేతలు అమరావతి యాత్రలో పాల్గొనడం కంటే ఢిల్లీకి యాత్ర చేయాలని సూచించారు.
యాత్రకు రక్షణగా ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. అటు ఇటు రోప్ పార్టీగా బౌన్సర్లు నిలబడగా వారి మధ్యలో అమరావతివాదులు పాదయాత్ర చేస్తూ వెళ్లారు. తొలిరోజు భారీగా విరాళాలు వచ్చాయి. యాత్ర ప్రారంభ గ్రామాల్లోనూ 16 లక్షలు వసూలైంది. కొందరు చెక్కుల రూపంలో విరాళాలు ఇచ్చారు. భాష్యం ప్రవీణ్ ట్రస్ట్ 5 లక్షలు ఇచ్చారు.
మంగళగిరి వైద్యుల సంఘం లక్ష విరాళం ప్రకటించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తల్లి జయప్రద లక్ష రూపాయలను చెక్కు రూపంలో అమరావతివాదులకు విరాళం ఇచ్చి ప్రోత్సహించారు. సోమవారం ఒక్క రోజే 16 లక్షలు వసూలైనట్టు అధికారికంగా అమరావతి జేఏసీ ప్రకటించింది. యాత్ర మార్గంలో టీడీపీ నేతలు, వారి మద్దతుదారులు భారీగా విరాళాలు ఇస్తారని అమరాతివాదులు అంచనా వేస్తున్నారు.