మార్గదర్శిని మోస్తున్న పవన్
రామోజీపై సర్కార్ చర్యను వ్యక్తిగత దాడిగానే అందరు చూడాలంటూ పిలుపిచ్చారు. మంచం మీద పడుకుని ఉన్న ఫొటోలను విడుదల చేయటం జగన్ ప్రభుత్వం శాడిజానికి పరాకాష్ట అని పవన్ రెచ్చిపోయారు.
మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. చిట్ ఫండ్స్ కేసుల నుంచి బయటపడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మద్దతుగా తెచ్చుకున్నారు. పవన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూపేరుతో మార్గదర్శికి మద్దతుగా మాట్లాడించారు. ఫుల్ కవరేజి ఇస్తున్నారు కదాని పవన్ కూడా అడ్డదిడ్డంగా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయి రామోజీకి మద్దతుగా మాట్లాడేశారు. ఎంతమందితో మద్దతుగా మాట్లాడించినా తాను చేసిన మోసాలన్నీసక్రమమైపోవన్న విషయాన్ని రామోజీకి తెలియదా?
ఇంతకీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ ఏమంటారంటే రామోజీరావును ప్రభుత్వం వేధిస్తోందట. రామోజీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి శాడిజానికి పరాకాష్టట. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా విచారణ పేరుతో వేధిస్తున్నారట. మార్గదర్శి ఎండీ శైలజకు ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణ పేరుతో వేధించటమే ప్రభుత్వం క్రూరత్వంగా పవన్ చెప్పారు. అంతలా వేధించటానికి రామోజీ, శైలజ ఏమన్నా నేరస్థులా అంటు మండిపోయారు. జగన్ వ్యతిరేక వార్తలు రాస్తే ఇలానే వేధిస్తారా అంటు అమాయకంగా అడిగారు.
రామోజీపై సర్కార్ చర్యను వ్యక్తిగత దాడిగానే అందరు చూడాలంటూ పిలుపిచ్చారు. మంచం మీద పడుకుని ఉన్న ఫొటోలను విడుదల చేయటం జగన్ ప్రభుత్వం శాడిజానికి పరాకాష్ట అని పవన్ రెచ్చిపోయారు. అంతా బాగానే ఉంది కానీ అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఎలాంటి మోసం జరగలేదని మాత్రం పవన్ చెప్పలేకపోయారు. మార్గదర్శి ఏర్పాటు, వ్యాపారమంతా మోసాలే అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. ఉండవల్లి ప్రకారం రామోజీ మోసాలు కోర్టులో దాదాపు నిర్ధారణైపోయాయి. విచారణ పూర్తయితే కోర్టు ఏమిచెబుతుందో చూడాలి.
ఇక సీఐడీ విచారణలో కూడా మార్గదర్శి ఖాతాదారుల నిధులు చిట్టేతర వ్యాపారాలకు మళ్ళినట్లు ఆధారాలను అధికారులు రిలీజ్ చేశారు. దాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. తాము మోసాలకు పాల్పడినట్లు విచారణలో రామోజీ, శైలజ ఇచ్చిన సమాధానాలతోనే అర్థమవుతోంది. వ్యాపారం చేస్తున్న వాళ్ళే తాము మోసాలకు పాల్పడలేదని చెప్పటంలేదు. అలాంటిది జగన్ మీద కోపంతో పవన్ లాంటి వాళ్ళు మార్గదర్శిని మోసాలను భుజనా మోయటమే విచిత్రంగా ఉంది. మోసాలు బయటపడి శిక్ష తప్పదన్న టెన్షన్ రామోజీలో పెరిగిపోతున్నట్లుంది. అందుకని దింపుడు కళ్ళెంలాంటి ప్రయత్నాలకు దిగారు.