గొడవలు కూడా ఆరోగ్యంగా ఉండాలట!
భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు ప్రేమించుకోవడమే కాదు ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకమీద మరొకరు కోపాన్ని ప్రదర్శిస్తారు, విమర్శలు చేసుకుంటారు. అవన్నీ ఒకోసారి గొడవలకు, వాదనలకు దారితీయవచ్చు. ఇలా జరిగే గొడవల వల్ల ఒకరిమీద మరొకరికి గౌరవం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా జరగడం బంధానికి అంత మంచిది కాదు. వీటివల్ల ఉన్న విషయం పక్కదారి పట్టి అసందర్భ విషయాలలోకి జారిపోతారు. ఇద్దరిమధ్య గొడవ లేదా వాదన అనేది కూడా ఆరోగ్యకరంగా ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని బంధాన్ని […]
భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు ప్రేమించుకోవడమే కాదు ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకమీద మరొకరు కోపాన్ని ప్రదర్శిస్తారు, విమర్శలు చేసుకుంటారు. అవన్నీ ఒకోసారి గొడవలకు, వాదనలకు దారితీయవచ్చు. ఇలా జరిగే గొడవల వల్ల ఒకరిమీద మరొకరికి గౌరవం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా జరగడం బంధానికి అంత మంచిది కాదు. వీటివల్ల ఉన్న విషయం పక్కదారి పట్టి అసందర్భ విషయాలలోకి జారిపోతారు. ఇద్దరిమధ్య గొడవ లేదా వాదన అనేది కూడా ఆరోగ్యకరంగా ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని బంధాన్ని ఇంకా ధృడం చేసుకోవచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్ లు చెబుతున్నారు.
ఏ విషయం అయినా ఎలా ప్రస్తావనకు రావాలి? ఒకరికొకరు ఎలా తెలియజేసుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియవు. గొడవ పడటం లేదా వాదించుకోవడంలో వ్యక్తం చేసే కొన్ని అభిప్రాయాలు ఇద్దరి వ్యక్తిత్వాలను స్పష్టం చేస్తాయని, అందువల్ల గొడవలు, వాదనలు కూడా ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని, అలా అర్థం చేసుకోవడమే ఆరోగ్యకరమైన బంధానికి మూలమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
వ్యక్తం చేయడం!
గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఏ కారణంగా అది జరుగుతోందో దానికి సంబంధించి మనసులో ఉన్న అభిప్రాయాలను బయటకు చెప్పాలి. ఆ సమయంలో కేవలం ఆ కారణం గురించి మాత్రమే చెప్పాలి తప్ప ఎదుటివ్యక్తిలో ఉన్న వేరే ఇతర తప్పులలోకి వెళ్లకూడదు, వాటిని వేలెత్తిచూపించకూడదు, విమర్శించకూడదు. గొడవ వాదన అనేవి మనసు బాధపడటం వల్లనే మొదలవుతాయి కాబట్టి ఆ బాధను బయటకు వ్యక్తం చేయాలి తప్ప ఆ బాధను కాస్తా కోపంగా మార్చి నోరుజారకూడదు.
స్పష్టత ముఖ్యం!
మాట్లాడేముందు విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఒకరు చెప్పిన విషయం గురించో లేదా పూర్తిగా తెలియని విషయం గురించి గొడవల్లోకి దిగడం చాలా పొరపాటు. అలాగే గొడవ పడినప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల మనసులు గాయపడతాయి, తరువాత ఏమి చేసినా అంతతొందరగా ఆ గాయం తాలూకూ బాధ అవతలి వాళ్ళు మర్చిపోలేకపోవచ్చు. వాళ్ళ దృష్టిలో మీ గౌరవం తగ్గిపోవచ్చు. కాబట్టి స్పష్టత లేకుండా పెదవి విప్పకూడదు.
బాధ్యతగా ఉండాలి!
ఒకవేళ నిజంగా మీవైపు తప్పు ఉంటే దాన్ని ఎలాంటి సంకోచం లేకుండా భాగస్వామి దగ్గర ఒప్పేసుకోవాలి. విషయాన్ని నేర్పుగా, మెల్లగా చెప్పాలి. ఆ తప్పు జరగడానికి కారణాలు, పరిస్థితులను భాగస్వామి ముందు వివరించాలి. జరిగిన తప్పుకు బాధ్యత వహించాలి. అవతలి వ్యక్తి బాధపడితే తప్ప గొడవచేయడంలేదు అనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. అన్ని విషయాలను స్పష్టంగా చెప్పాలి. అప్పుడు భాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా ఆ తప్పుకు తగిన పరిష్కారం లేదా దాన్ని సరిదిద్దుకునే మార్గం భాగస్వామి దగ్గరే దొరకవచ్చు.
సమర్థింపులు వద్దు!
ఈ ప్రపంచంలో పిచ్చోడు కూడా తాను చేసిన పని సరైనదే అని సమర్థించుకుంటాడు. కొన్నిసార్లు సమర్థించుకోవడం అనేది కొంపలు ముంచుతుంది. బలమైన కారణం లేకపోతే తప్ప సమర్థింపుల జోలికి వెళ్లకూడదు. మూర్ఖంగా “ఇదే, ఇలాగే, నీకేం తెలుసు?? ఆ పరిస్థితి అనుభవించేవాళ్లకు అర్థమవుతుంది కానీ నీకేంటి ఎన్నైనా చెబుతావు, నన్నే తప్పు పడతావా??” వంటి మాటల చిందులు తగ్గించుకుంటే మంచిది. తప్పు చేయడం దాన్ని కప్పిపుచ్చుకోవడం తెలివిలేనిపని.
పై విషయాలు మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య అపార్థాలకు దారితీసే గొడవలు, సందర్భాలు వచ్చినపుడు భావోద్వేగాలను ఉన్నపళంగా బయటపెట్టకుండా వాటికి కూడా ఒక సందర్భాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయటకు చెప్పి దగ్గరదగ్గరగా కూర్చుని విషయాలు మెల్లిగా బయటకు వ్యక్తం చేస్తూ వాటిని ఒక చర్చలాగా మొదలుపెట్టి, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవడం మంచిది. అలా చేస్తే గొడవలు కూడా బంధాలు గట్టిపడటానికి కారణం అవుతాయి.