కేంద్రం డబుల్ ఇంజిన్ పాలనపై కేటీఆర్ తిరుగులేని పంచ్..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ పాలనతో అభివృద్ధిలో పరుగులు పెట్టొచ్చంటూ ఇటీవల కమలదళం ప్రజలకు హితబోధ చేస్తోంది. రాష్ట్రాల్లో కూడా బీజేపీకే అధికారం కట్టబెట్టాలని, అప్పుడే డబుల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యమని చెబుతోంది. అయితే ఈ డబుల్ ఇంజిన్ అనేది పనికిరాని పోలిక అని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వంపై ఆయన సెటైరికల్ ట్వీట్ వేశారు. దేశానికి కావాల్సింది డబుల్ […]

Advertisement
Update:2022-06-13 08:48 IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ పాలనతో అభివృద్ధిలో పరుగులు పెట్టొచ్చంటూ ఇటీవల కమలదళం ప్రజలకు హితబోధ చేస్తోంది. రాష్ట్రాల్లో కూడా బీజేపీకే అధికారం కట్టబెట్టాలని, అప్పుడే డబుల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యమని చెబుతోంది. అయితే ఈ డబుల్ ఇంజిన్ అనేది పనికిరాని పోలిక అని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వంపై ఆయన సెటైరికల్ ట్వీట్ వేశారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని, పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదని అన్నారు కేటీఆర్.

ఉదాహరణలు చూడండి..

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకెళ్తోందని ఇటీవల గణాంకాలతో సహా నేతలు రుజువులు చూపెడుతున్నారు. అదే సమయంలో జాతీయ సగటుని తెలంగాణ ఎప్పుడో దాటేసిందనే ఉదాహరణలు కూడా ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ, దేశ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తోందని కేటీఆర్ తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. ఇది రాష్ట్రం సొంతంగా తయారు చేసిన నివేదిక కాదని, 2021 అక్టోబర్ లో ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక గణాంకాలు అని క్లారిటీ ఇచ్చారు.

తగ్గేదే లేదు..
ఓవైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది, మరోవైపు తెలంగాణలో బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటోంది. దీంతో ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు బీజేపీ అగ్రనాయకత్వం కూడా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు కేంద్రం నిధులు, రాయితీల విషయంలో కూడా కఠినంగా ఉంటోంది. ఇలాంటి వ్యతిరేకతలన్నీ తట్టుకుని నిలబడిన టీఆర్ఎస్ అధినాయకత్వం బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కి దిగింది. అభివృద్ధిలో తెలంగాణ, భారత్ తో పోల్చి చూస్తే ఎన్నోరెట్లు ముందుందని, తెలంగాణ లాగే, భారత్ కూడా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే భారత్ రాష్ట్రీయ సమితి ఒక్కటే ప్రత్యామ్నాయమని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.

Tags:    
Advertisement