బైక్ ఢీకొడితే గాలిలోకి ఎగిరి పడ్డ కారు….కథ , దర్శకత్వం ఎస్ ఐ సారు

రోడ్డు మీద అటు నుంచి ఒక కారు వస్తోంది…ఇటు నుంచి ఓ బైక్ వెళ్తోంది. రోడ్డు మధ్యలో బైక్ వెళ్ళి కారును ఢీకొట్టింది. ఆ దెబ్బకు కారు గాలిలోకి పైకి ఎగిరి గాలిలో రౌండ్లు కొడుతూ దూరంగా ఓ గుంతలో వెళ్ళి పడింది. ఇది సినిమా కాదు నిజంగా జరిగింది. మీకు ఆశ్చర్యంగా ఉందా ? నమ్మాలనిపించడంలేదా ? అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్ కు వెళ్ళి చూడండి. అక్కడొక ఎఫ్ ఐ ఆర్ […]

Advertisement
Update:2022-05-31 08:58 IST

రోడ్డు మీద అటు నుంచి ఒక కారు వస్తోంది…ఇటు నుంచి ఓ బైక్ వెళ్తోంది. రోడ్డు మధ్యలో బైక్ వెళ్ళి కారును ఢీకొట్టింది. ఆ దెబ్బకు కారు గాలిలోకి పైకి ఎగిరి గాలిలో రౌండ్లు కొడుతూ దూరంగా ఓ గుంతలో వెళ్ళి పడింది. ఇది సినిమా కాదు నిజంగా జరిగింది. మీకు ఆశ్చర్యంగా ఉందా ? నమ్మాలనిపించడంలేదా ? అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్ కు వెళ్ళి చూడండి. అక్కడొక ఎఫ్ ఐ ఆర్ ఉంటుంది తీసి చదవండి. అది నిజ్జంగా జరిగిందని పోలీసులు చెప్తారు. అప్పుడైనా నమ్మండి.

అయితే ఈ యాక్షన్ కథకు దర్శకత్వం గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్. సహకారం కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సుధాకర్ .

బైక్ నడిపిన అనిల్ భార్య చిట్టెమ్మ అనంతపురం ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఇచ్చిన పిర్యాదు మేరకు అసలు జరిగిందేంటో తెలుసుకుందాం…..

అనిల్‌ కుమార్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా కళ్యాణదుర్గం మండలం ఉల్లికల్లు వద్ద ఎదురుగా వచ్చే కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అనిల్ కు కాలు, చెయ్యి విరిగింది. ఈ ప్రమాదంలో తన భర్త తప్పు లేదని, కారు రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీ కొందని చిట్టెమ్మ చెప్తోంది. అయితే బైక్ ను ఢీ కొట్టిన కారులో ఉన్నది గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్. దాంతో కథ మారిపోయింది. కారు బలహీనమైనదిగా, బైక్ బల‌మైందిగా ఎఫ్ ఐ ఆర్ రాయబడింది.

భర్త అనిల్ ఆస్పత్రి పాలైతే చిట్టెమ్మ వెళ్ళి కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సుధాకర్ కు పిర్యాదు చేస్తే ఆయన కేసు నమోదు చేయలేదు. పైగా గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్ కు మద్దతుగా బైక్ గుద్దింది, కారు ఎగిరింది అని అనిల్ మీదనే కేసు నమోదు చేశాడు.

ఈ కథంతా ఎస్పీకి వివరించిన చిట్టెమ్మ తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత విలేకరులను కలిసి తన ఆవేదన చెప్పుకుని, కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పుడిక గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్ గ్రాఫిక్స్ సినిమా గెలుస్తుందో నిజం గెలుస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement