సంక్రాంతి వంటకాలు…. పూతరేకులు తయారీ విధానం
Pootharekulu, Putharekulu Recipe: ఈ స్వీట్‌ను కాగితాన్ని పోలి ఉండే పొర-సన్నని బియ్యం పిండి పొరలో చుట్టి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ మరియు గింజలతో నింపబడి ఉంటుంది.
పూతరేకులు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక ప్రసిద్ధ భారతీయ స్వీట్. ఈ స్వీట్‌ను కాగితాన్ని పోలి ఉండే పొర-సన్నని బియ్యం పిండి పొరలో చుట్టి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ మరియు గింజలతో నింపబడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పండుగలు మరియు వివాహాలకు ఈ స్వీట్ ప్రసిద్ధి చెందింది.
కావల్సిన వస్తువులు:
- చక్కెర – ఒక కేజీ
- సగ్గుబియ్యం- ముప్పావు కేజీ
- జీడిపప్పు – పావు కేజీ
- ఏలకులు – 50 గ్రాములు
- నెయ్యి- 100 గ్రాములు
తయారీ:
తెల్లగా, మెత్తగా చూడగానే నోరూరే పూత రేకులను చుట్టడం సులభమే కానీ, అందుకోసం రేకులను తయారు చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకంగా కుండలు దొరుకుతాయి.
ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజిలా చేసుకోవాలి. కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తర్వాత, తెల్లగి శుభ్రమైన నలుచదరమైన క్లాత్‌ను సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండ పరిచి వెంటనే క్లాత్‌ను తీసేయాలి. క్లాత్‌కు అంటిన గంజి కుండ వేడికి పలుచని రేకులా వస్తుంది.
ఆ రేకును కుండ నుంచి తీయడం చాలా నైపుణ్యంతో చేయాలి. రేకు మధ్యలోకి విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి. గంజి మొత్తాన్ని ఇలాగే రేకులుగా చేసుకోవాలి.
రేకు తయారీ కోసం వాడే క్లాత్ తప్పని సరిగా కాటన్‌దే అయి ఉండాలి.
రేకు ఏ సైజ్‌లో కావాలంటే క్లాత్‌ను ఆ సైజ్‌కు కట్ చేసుకోవాలి.
జీడిపప్పు, చక్కెర, ఏలకులను పొడి చేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక రేకు తీసుకుని నెయ్యి రాసి జీడిపప్పు మిశ్రమం ఒక స్పూను వేసి పలుచగా పరిచి పైన మరొక రేకును పరిచి మడత వేయాలి. పూత రేకు రెడీ. ఇలా అన్ని రేకులను చేసుకోవాలి. ఇవి 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.
గమనిక: రేకులను ఎక్కువ మోతాదులో చేసుకుని తడి లేని, గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. పూతరేకు కావాలనిపించినప్పుడు కొద్దిగా జీడిపప్పు, చక్కెర, ఏలకుల మిశ్రమాన్ని అప్పటికప్పుడు రెడీ చేసుకుని నిల్వ ఉంచుకున్న రేకుల్లో వేసి మడత పెడితే ఇన్‌స్టంట్‌గా తాజా పూతరేకులు రెడీ.