సంక్రాంతి వంటకాలు…. నువ్వుల కజ్జికాయలు తయారీ విధానం
Nuvvula Kajjikayalu Recipe: మన సంప్రదాయ వంటకాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. నువ్వుల్లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది.
మన సంప్రదాయ వంటకాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. నువ్వుల్లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది.
ఈ స్వీట్స్ వల్ల మరొక ఉపయోగం ఏమిటంటే… వీటిలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ తిన్న వెంటనే ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం ఉండదు. నెమ్మదిగా జీర్ణం అవుతూ శక్తి నిదానంగా విడుదలవుతుంది. పండుగలకే కాకుండా చక్కటి డైట్ ప్లాన్‌తో ఏడాది పొడవునా రోజుకు ఒకటి తింటే మంచిది. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా వీటిని పెట్టవచ్చు.
వీటితో మరొక ప్రయోజనం ఏమిటంటే… వీటిని తర్వాత సాచురేషన్ వస్తుంది. కాబట్టి చిప్స్ వంటి ఇతర జంక్‌ఫుడ్ జోలికి మనసు పోదు.
కావల్సిన వస్తువులు:
- గోధుమ పిండి లేదా మైదాపిండి- ఒక కేజీ
- నువ్వులు – ఒక కేజీ
- బెల్లం- 800 గ్రాములు
- ఏలకులు-10 గ్రాములు
- జీడిపప్పు – 100 గ్రాములు
- నెయ్యి లేదా నూనె – వేయించడానికి కావలసినంత
(నెయ్యి రుచిని పెంచుతుంది. కానీ కజ్జికాయలు త్వరగా మెత్తబడిపోతాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నూనెతో చేసుకోవడం మంచిది)
నువ్వుల కజ్జికాయలు తయారీ విధానం:
మైదా పిండిని చపాతీల పిండిలా కలుపుకుని తడి క్లాత్‌ని కప్పి పక్కన పెట్టాలి.
నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని, ఏలకులను పొడి చేయాలి. ఈ మూడింటిని బాగా కలపాలి.
జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
గోధుమ పిండిని చిన్న చిన్న రౌండ్‌లు చేసుకోవాలి. ఒక్కొక్క రౌండును పూరీ ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకోవాలి. ఆ పూరీని సాంచి (కజ్జికాయల కోసం తయారు చేసిన చెక్కతో చేసిన మౌల్డ్)లో పరిచి అందులో ఒక స్పూను నువ్వుల మిశ్రమాన్ని (నువ్వులు, బెల్లం, ఏలకుల పొడి కలిపిన మిశ్రమం), ఒక జీడిపప్పును పెట్టి సాంచిని మూత వేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా కజ్జికాయలను ఒకదానికి ఒకటి తగలకుండా ఆరబెట్టుకోవాలి.
ఈ లోపు బాణలిలో నూనె మరిగించి కజ్జికాయలను వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. హైలో పెడితే లోపల పిండి కాలక ముందే కజ్జికాయలు ముదురు ఎరుపురంగులోకి మారి మాడిపోతాయి.
ఇలా చేసిన కజ్జికాయలను తడి లేని శుభ్రమైన డబ్బాలో నిల్వ చేసుకోవాలి, రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.