సందర్భోచితమైన “ఆన్ నేషనలిజం”
జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి లాంటి మాటలు ఈ మధ్యన మరీ ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఈ మాటలకు నిర్వచనాలను మార్చేసే పని జోరుగా సాగుతోంది. ఈ నిర్వచనాలకు అనుగుణంగా ఎవరు జాతీయవాదులో, ఎవరు దేశభక్తులో, ఎవరు దేశ ద్రోహులో నిర్ణయిస్తున్నారు. తమ నిర్వచనం ప్రకారం జాతీయవాదులు, దేశభక్తులు కారు అనుకునే వారి మీద దేశద్రోహ అభియోగాలు మోపుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యా కుమార్ మీద దేశద్రోహ అభియోగం మోపడం దీనికి […]
జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి లాంటి మాటలు ఈ మధ్యన మరీ ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఈ మాటలకు నిర్వచనాలను మార్చేసే పని జోరుగా సాగుతోంది. ఈ నిర్వచనాలకు అనుగుణంగా ఎవరు జాతీయవాదులో, ఎవరు దేశభక్తులో, ఎవరు దేశ ద్రోహులో నిర్ణయిస్తున్నారు. తమ నిర్వచనం ప్రకారం జాతీయవాదులు, దేశభక్తులు కారు అనుకునే వారి మీద దేశద్రోహ అభియోగాలు మోపుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యా కుమార్ మీద దేశద్రోహ అభియోగం మోపడం దీనికి తాజా ఉదాహరణ.
జాతీయత, దేశభక్తి అన్న భావనలు ప్రభుత్వాలు, అధికారం మారినప్పుడల్లా మారి తీరవలసిన అంశాలు కావు. భారతీయ జనతా పార్టీ ఇటీవల తమది సాంస్కృతిక జాతీయతా వాదం అంటోంది. అంటే జాతీయతా వాదానికి కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాంస్కృతిక జాతీయతావాదం అన్న మాటను సంఘ్ పరివారు బీజేపీ ఎక్కువగా వినియోగిస్తూ ఉండొచ్చు కాని ఆ భావన చాలా కాలం నుంచే సంఘ్ పరివార్ లో ఉంది. 1967 లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం ట్రిబ్యునల్ ముందు హాజరైన ఆర్.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి “ఆర్.ఎస్.ఎస్. అభిప్రాయంలో సాంస్కృతిక వాదం అంటె హిందూ జాతీయతా వాదమే” అని తేల్చి చెప్పారు. భారత్ మాతృ భూమిగా భావించే సిక్కులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరు మత రీత్యా భిన్నమైన వారే అయినప్పటికి సంస్కృతిని బట్టి చూస్తే హిందువులే” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యానమే వివాదాలకు దారితీస్తోంది.
“భారత్ మాతాకి జై” అని నినదించని వారిని జాతివిద్రోహులుగా జమకడ్తున్నారు. ఇలా వ్యవహరించడం వల్ల ఒక వ్యక్తి తాను ఉంటున్న సమాజంలోని వాడిగా గుర్తించడానికి, సమాజం అవసరాలు ఏమిటో పట్టించుకోవడానికి అవరోధం కలుగుతోంది. “జెండాలు పట్టుకు తిరగడం, నినాదాలు చేయడం జాతీయతకు చిహ్నం కాదు. భారత్ మాతాకి జై అని నినదించని వారిని జాతి విద్రోహులుగా పరిగణిస్తున్న వారు పన్నులు ఎగవేసే వారిని, నల్లధనం కూడబెట్టే వారిని దేశద్రోహులుగా పరిగణించడం లేదు” అని ప్రసిద్ధ చరిత్రకారిణి, గౌరవ స్థానం సంపాదించిన మేధావి రొమిల్లా థాపర్ ప్రశ్నిస్తున్నారు. అసలైన జాతీయతా వాదం అంటే ఏమిటి, మన జాతీయభావనలకు మూలం ఏమిటి అన్న మౌలిక ప్రశ్నలకు సమాధానాలు అందించేందుకు రొమిల్లా థాపర్, ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి. నూరాని, కళా రంగ నిపుణుడు సదానంద్ మీనన్ “ఆన్ నేషనలిజం” అన్న చిరు గ్రంథం ద్వారా ప్రయత్నించారు.
177 పేజీలకు పరిమితమైన ఈ చిరుగ్రంథం జాతీయతావాదం చర్చనీయాంశం అయిన సమయంలో, సంఘ్ పరివార్ భావజాలాన్ని ఆమోదించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న సమయంలో వెలువడింది. ఈ సందర్భంలో ఇలాంటి గ్రంథం వెలువడడం జాతీయతావాదం గురించి సవ్యంగా అలోచించే వారికి, వక్రీకరించే వారికి కూడా మేధోపరమైన చర్చకు వీలు కల్పిస్తుంది.
జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి లాంటి భావనలు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వైఖరులకు సంబంధించినవి కావు. జాతీయతను సంకుచితమైన చట్రంలో బిగించకూడదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న సంఘ్ పరివార్ లో అంతర్భాగమైన బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ఆధారంగా జాతీయతావాదాన్ని నిర్వచించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దశలో మన దేశానికి కావాల్సిన జాతీయతా వాదం ఏమిటో, భారతీయులకు ఉండవలసని జాతీయతా భావం ఎలాంటిదో కూలంకషంగా చర్చించవలసిన అవసరం ఉంది. హిందు అన్నది మతం అయితే హిందువ్య ఒక నిర్దిష్ట భావజాలం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం బాగా తోడ్పడుతుంది.
మన జాతీయతావాద మూలాలు ఎక్కడున్నాయో గ్రహించడానికి రొమిల్లా థాపర్ వ్యాసం ఉపకరిస్తుంది. జాతీయతావాదం అన్న భావనకు వలసవాద వ్యతిరేకత, సెక్యులర్ భావజాలమే మూలమని రొమిల్లా థాపర్ సోపపత్తికంగా నిరూపించారు. మత ప్రాదిపదిక ఆధారంగా జాతీయతావాదాన్ని నిర్వచించే హిందుత్వ వాదులు, ముస్లింలు కూడా వలసవాద వ్యతిరేక పోరాటంలో నిర్వహించిన పాత్ర నామమాత్రమైందని ఆమె అంటారు. గత చరిత్రను మతం ఆధారంగా చూడడం వలసవాద చరిత్రకారులు మన మీద రుద్దిన పద్ధతి. ప్రస్తుతం మతం ఆధారంగా జాతీయతావాదాన్ని వింగడిస్తున్న వారూ దురదృష్టవశాత్తు అదే దృక్కోణాన్ని అనుసరిస్తున్నారు. “ముస్లింలు మనలను దాదాపు వెయ్యేళ్లపాటు అణగదొక్కారు అని అంగలార్చే వారు రెండు సహస్రాబ్దల పాటు దళితులను, ఆదివాసులను అణగదొక్కిన వైనం గురించి ఆలోచించరెందుకని థాపర్ ప్రశ్నిస్తున్నారు.
ఎ.జి.నూరాని వ్యాసంలో దేశద్రోహానికి సంబంధించిన చట్టం మూలాలను విడమర్చి చెప్పరు. ‘భారత్ మాతాకి జై’ నినాదం వెనక ఉన్న ఆంతర్యాన్ని విశ్లేషణాత్మకంగా వివరించారు. భారత శిక్షా స్మృతిలోని 124ఎ సెక్షన్ దేశద్రోహానికి సంబంధించింది. ఇది బ్రిటిశ్ వాళ్లు రూపోందించిన శిక్షా స్మృతిలో భాగం. ఇది ఇప్పటికీ అమలులో ఉండడం ఓ భయంకర వైపరీత్యం. రాజకీయ ఉద్యమాలను అణచడానికి, పత్రికలను నియంత్రించడానికి బ్రిటిష్ వలసపాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నారు. 1860లో తయారైన భారత శిక్షా స్మృతిలో ఈ సెక్షన్ లేనే లేదు. ఇంగ్లండ్ లో అమలులో ఉన్న చట్టాన్ని అనుసరించి 1870లో చట్టాన్ని సవరించి 124ఎ సెక్షన్ చేర్చారు. భారత జాతీయవాదుల నోరు నొక్కడం కోసం వలసవాదులు ఈ చట్టాన్ని వినియోగించుకున్నారు. దేశద్రోహానికి సంబంధించిన ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అని చర్చోపచర్చలు జరిగాయి. మొత్తం మీద ‘దేశద్రోహం’ రాజ్యాంగంలో చోటు సంపాదించింది. ఈ చట్టం చాలా అభ్యంతరకరమైందని, గర్హనీయమైనదని భావించిన నెహ్రూ స్వాతంత్ర్యం తర్వాత 124ఎ సెక్షన్ ను తొలగించాలని భావించారు.
స్వాతంత్ర్యం తర్వాత రెండు సందర్భాలలో హై కోర్టు న్యాయమూర్తులు 124ఎ సెక్షన్ చెల్లదని తీర్పు చెప్పారు. అలహాబాద్ హై కోర్టు ఈ సెక్షన్ చెల్లదని ప్రకటించింది. కాని 1962లో కేదార్ నాథ్ సింగ్ కు బిహార్ ప్రభుత్వానికి మధ్య కేసులో ఈ సెక్షన్ ప్రకారమే ఫార్వర్డ్ కమ్యునిస్టు పార్టీ నాయకుడు కేదార్ నాథ్ హింసాత్మకమైన విప్లవాన్ని ప్రేరేపించాడన్న అభియోగంతో ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా విధించారు. మరో విచిత్రం ఏమిటంటే మన దేశంలో అమలులో ఉన్న 124ఎ సెక్షన్ కు ఆధారమైన చట్టాన్ని బ్రిటన్ లో 2009 లో రద్దు చేశారు. 1962లో మళ్లీ అమలులోకి వచ్చిన ఈ సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
సాంస్కృతిక జాతీయవాదం వల్ల మొట్టమొదట నష్టపోయేది సంస్కృతేనని సదానంద్ మీనన్ ఈ గ్రంథంలో వాదించారు. జాతి రాజ్యాలు అన్న భావనల వెనక ఉన్నది ఈ సాంస్కృతిక జాతీయతావాదమేనని అంటారు. ఈ వాదాన్ని బలపరిచే వారు జాతి రాజ్యం అన్న భావనలో కుట్రపూరితంగా రాజకీయ హక్కుల స్థానంలో సాంస్కృతిక హక్కులను చేర్చే ప్రక్రియను మీనన్ వివరించారు.
-ఆర్వీ రామారావ్
Click on Image to Read: