కేసీఆర్ దత్తత గ్రామాస్తులకు వార్నింగ్ ఇచ్చిన ఈటెల
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి ఈటెల రాజేందర్‌కు కోపం వచ్చింది. ఇంతకీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరిపైనో తెలుసా? సీఎం దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామస్తులపైనే.. వివరాలు.. మంత్రి ఈటెల రాజేందర్ గురువారం చిన్నముల్కనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. ఇక్కడ 247 మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. అయితే, […]
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి ఈటెల రాజేందర్‌కు కోపం వచ్చింది. ఇంతకీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరిపైనో తెలుసా? సీఎం దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామస్తులపైనే.. వివరాలు.. మంత్రి ఈటెల రాజేందర్ గురువారం చిన్నముల్కనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. ఇక్కడ 247 మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. అయితే, డబుల్ బెడ్ రూం ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ.. తమను కూడా లబ్ధిదారుల జాబితాలో ఎంపిక చేయాలని కొందరు గ్రామస్తులు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. పదేపదే అడ్డుకోవడంతో మంత్రి అసహనానికి గురయ్యారు. అల్లరి చేస్తే.. ఊరుకునేది లేదు.. తొక్కి పడేస్తాం.. సీఎం దత్తత తీసుకున్న గ్రామంలో ఆందోళనలు చేస్తుంటే గ్రామపెద్దలు అడ్డుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఈటెలకు కోపం రావడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యపోయారు.
గతేడాది ఆగస్టులో చిన్నముల్కనూరు గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గ్రామస్థులందరికీ ఇళ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. అర్హులు, లబ్ధిదారుల ఎంపిక జరగకముందే గ్రామస్థాయి నాయకులు ఊరివారందరికీ కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దీంతో కొత్త ఇళ్లను కూడా కూల్చుకున్నారు చాలామంది. ఆ తరువాత జరిగిన లబ్ధిదారుల ఎంపికలో కొందరినే అర్హులుగా గుర్తించారు అధికారులు. దీంతో ఇళ్లు కూల్చుకున్నవారంతా లబోదిబోమంటున్నారు. వారే మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పాపం మబ్బుల్లో నీళ్లకని ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా.. గల్లీనాయకుల మాటలు విని ఉన్న గూడు కూల్చుకుని న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు చిన్నముల్కనూరు గ్రామస్థులు.